
సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan)ను టీమిండియాకు ఆడే స్థాయికి చేర్చడంలో అతడి తండ్రి నౌషద్ ఖాన్ (Naushad Khan)ది కీలక పాత్ర. పెద్ద కొడుకు సర్ఫరాజ్‌తో పాటు చిన్నోడు ముషీర్ ఖాన్‌ను తన శిక్షణలో రాటుదేలేలా చేశాడు నౌషద్. తానే స్వయంగా కోచింగ్ ఇస్తూ ఇద్దరు కుమారులను మేటి క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నాడు.
అధిక బరువు, ఫిట్‌నెస్ లేమి
అయితే, ముంబై తరఫున రంజీల్లో పరుగుల వరద పారించినా సర్ఫరాజ్ ఖాన్‌కు టీమిండియా ఎంట్రీ అంత సులువేం కాలేదు. ముఖ్యంగా అతడి అధిక బరువు, ఫిట్‌నెస్ లేమిపై తరచూ విమర్శలు వచ్చేవి. ఎట్టకేలకు గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికి ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం.
ఆరువారాల్లోనే ఏకంగా పది కిలోల బరువు తగ్గి
అయితే, ఆస్ట్రేలియా పర్యటనతో పాటు ఇంగ్లండ్ టూర్‌లోనూ సెలక్టర్లు సర్ఫరాజ్‌ను పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించిన 27 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కేవలం ఆరువారాల్లోనే ఏకంగా పది కిలోల బరువు తగ్గడం విశేషం. మొత్తంగా రెండునెలల్లోనే 17 కిలోలు తగ్గిపోయాడు. ఇందుకు ప్రధాన కారణం అతడి తండ్రి నౌషద్ ఖాన్.
కుమారులకు కోచ్‌గా ఉన్న నౌషద్ ఖాన్.. ఫిట్‌నెస్ విషయంలోనూ వారికి ఆదర్శంగా ఉండాలని భావించాడు. అందుకే సర్ఫరాజ్‌తో కలిసి కఠినమైన డైట్ పాటించి ఆరు నెలల్లోనే ఏకంగా 38 కిలోల బరువు తగ్గాడు. 122 కేజీల బరువు నుంచి 84 కిలోలకు చేరుకుని గుర్తు పట్టనంతగా మారిపోయాడు. ఈ క్రమంలో నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న నౌషద్ ఖాన్ వీడియో తాజాగా వైరల్‌గా మారింది.
సర్ఫరాజ్, నౌషద్ ఖాన్ ఫాలో అయిన డైట్ ఇదే
గతంలో నౌషద్ ఖాన్ మాట్లాడుతూ.. తాము రోటీ, అన్నం తినడం పూర్తిగా మానేశమని తెలిపాడు. అదే విధంగా ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, సలాడ్లు, బ్రకోలి, దోసకాయలు ఎక్కువగా తింటున్నామని తెలిపాడు.
అదే విధంగా కాల్చిన చేపలు, చికెన్, ఉడికించిన కోడిగుడ్లు, అవకాడోలు ఎక్కువగా తిన్నామని నౌషద్ ఖాన్ వెల్లడించాడు. రోటీ అన్నంతో పాటు చక్కెరను పూర్తిగా పక్కనపెట్టామని.. మైదాతో తయారయ్యే బేకరీ పదార్థాలను కూడా డైట్ నుంచి పూర్తిగా తొలగించినట్లు వెల్లడించాడు.
ఏకంగా 38 కిలోలు
ఇక ఆరునెలల్లోనే ఏకంగా 38 కిలోలు తగ్గడం గురించి 55 ఏళ్ల నౌషద్ ఖాన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘ఏప్రిల్ 11- అక్టోబరు 11 వరకు.. ఆరు నెలల కాలంలో నేను అనుకున్నది సాధించాను. 20-25 ఏళ్ల క్రితం చేయాలనుకున్న పనులను ఇపుడు నేను పూర్తి చేయగలను.
మా కుటుంబం మొత్తం బరువు తగ్గే మిషన్‌లో ఉంది’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా సర్ఫరాజ్ ఖాన్ చివరగా గతేడాది న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే!