ఐసీసీ సీఈఓగా సంజోగ్‌ గుప్తా | Sanjog Gupta appointed as ICC CEO | Sakshi
Sakshi News home page

ఐసీసీ సీఈఓగా సంజోగ్‌ గుప్తా

Jul 8 2025 3:29 AM | Updated on Jul 8 2025 3:29 AM

Sanjog Gupta appointed as ICC CEO

దుబాయ్‌: భారత మీడియా మొఘల్‌ సంజోగ్‌ గుప్తా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా నియమితులయ్యారు. ఈ ఏడాది పాకిస్తాన్‌ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు ఆ్రస్టేలియాకు చెందిన జెఫ్‌ అలర్‌డైస్‌ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉండటంతో సంజోగ్‌ గుప్తాతో భర్తీ చేశారు. జియోస్టార్‌ నెట్‌వర్క్‌కు సీఈఓగా వ్యవహరించిన సంజోగ్‌కు మీడియా రంగంలో విశేషానుభవం ఉంది. దీంతో పాటు భారత్‌కే చెందిన జై షా ఐసీసీ చైర్మన్‌గా ఉండటం కూడా అంతర్జాతీయ క్రికెట్‌ వ్యవహారాలు చక్కబెట్టే  పదవిని చేపట్టేందుకు కలిసొచ్చింది. 

అంతమాత్రాన పూర్తిగా జై షా చలవే అనలేం. ఎందుకంటే ఏళ్ల తరబడి మీడియా రంగంలో ఆయన విశేష కృషి చేశారు. అందువల్లేనేమో 2500 పైచిలుకు దరఖాస్తు చేసుకుంటే సంజోగ్‌నే సీఈఓ పదవి వరించింది. ఐసీసీలోని శాశ్వత, అనుబంధ సభ్యులైన 25 దేశాల నుంచి వేల సంఖ్యలో ఈ పదవి కోసం పోటీపడ్డారు. అనుభవం, పనితీరు ఆధారంగా ఒక్కో దేశం నుంచి 12 మంది చొప్పున తుది జాబితాకు ఖరారు చేయగా ఇందులో సంజోగ్‌ గుప్తా అర్హుడని ఐసీసీ కమిటీ భావించింది. 

ఈ నామినేషన్ల కమిటీలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాజా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ రిచర్డ్‌ థాంప్సన్, లంక క్రికెట్‌ అధ్యక్షుడు షమ్మీ సిల్లా, భారత బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సు మేరకే ఐసీసీ చైర్మన్‌ జై షా... సంజోగ్‌ను కొత్త సీఈఓగా నియమించారు.  

స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌గా వచ్చి... 
ఈ జనవరిలో పదవి నుంచి వైదొలిగిన అలర్‌డైస్‌ వారసుడిగా సంజోగ్‌ గుప్తా త్వరలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. ఐసీసీ చైర్మన్‌ తర్వాత రెండో ప్రాధాన్య పదవి సీఈఓ. దీంతో ఈ రెండు కీలకమైన పదవుల్లో భారతీయులే కొలువుదీరడం విశేషం. జై షా భారత హోం మంత్రి అమిత్‌ షా తనయుడు. కానీ గుప్తా మాత్రం ఢిల్లీలోని ద ట్రైబ్యున్‌ పత్రికలో ఓ సాధారణ స్పోర్ట్స్‌ జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి మీడియా మొఘల్‌గా ఎదిగాడు. 2010లో స్టార్‌ ఇండియా (ప్రస్తుత జియో స్టార్‌)లో సహాయ ఉపాధ్యక్షుడిగా చేరిన సంజోగ్‌ తన నేర్పు, నైపుణ్యం, అంకితభావం, నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగారు. 

కంటెంట్, ప్రొగ్రామింగ్, వ్యూహారచనతో ఓ చానెల్‌ నెట్‌వర్క్‌ను విస్తరించారు. మొదటి పదేళ్లు ఐపీఎల్‌ ‘సోనీ’ నెట్‌వర్క్‌లో ప్రసారమైంది. తర్వాత కోట్లు గుమ్మరించి ఐపీఎల్‌ సహా, ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌), ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ (ఐఎస్‌ఎల్‌) సహా ఎన్నో ప్రీమియర్‌ లీగ్‌ను, గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల ప్రసార హక్కుల్ని స్టార్‌ హస్తగతమయ్యేలా చేశారు. రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 నెట్‌వర్క్‌ డిస్నీ స్టార్‌ను సొంతం చేసుకోవడంతో రిలయన్స్‌ యాజమాన్యం గతేడాది సంజోగ్‌ గుప్తాను సీఈఓగా నియమించింది. ఇప్పుడైతే ఏకంగా ఐసీసీలో ఏడో సీఈఓగా అంతర్జాతీయ క్రికెట్‌ను వ్యవహారాలను చక్కబెట్టే పనిలో పడతారు.

7 ఐసీసీ సీఈఓగా నియమితుడైన ఏడో వ్యక్తి సంజోగ్‌ గుప్తా. 
గతంలో డేవిడ్‌ రిచర్డ్స్‌ (1993–2001), 
మాల్కం స్పీడ్‌ (2001–2008), 
హరూన్‌ లోర్గాట్‌ (2008–2012), 
డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ (2012–2019), 
మనూ సాహ్ని (2019–2021), 
జెఫ్‌ అలర్‌డైస్‌ (2021–2025) 
ఈ బాధ్యతలు నిర్వర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement