‘రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి’ | Sanjiv Goenka Reacts Punjab Fan Teases Him Wasting Money On Rishabh Pant | Sakshi
Sakshi News home page

‘రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి’

Apr 20 2026 5:20 PM | Updated on Apr 20 2026 6:02 PM

Sanjiv Goenka Reacts Punjab Fan Teases Him Wasting Money On Rishabh Pant

PC: IPL/X

లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకాకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు అభిమానులు గోయెంకాకు కృతజ్ఞతలు చెప్పిన తీరు వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌లో 2022లో చేరిన లక్నో జట్టు కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో ప్లే ఆఫ్స్‌ చేరింది.

రూ. 27 కోట్ల భారీ ధరకు
అయితే, సంజీవ్‌ గోయెంకా వైఖరితో విసిగిపోయిన కేఎల్‌ రాహుల్‌ (KL Rahul).. 2025 వేలానికి ముందు లక్నోను వీడాడు. గౌరవం లేని చోట తాను ఉండలేనని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో టీమిండియా మరో స్టార్‌ రిషభ్‌ పంత్‌ను కొనుగోలు చేసింది.

రూ. 26.75 కోట్లకు పంజాబ్‌ సొంతం
మరోవైపు.. 2024లో తమ జట్టుకు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వదిలేసింది. ఈ క్రమంలో అయ్యర్ కోసం కూడా ఫ్రాంఛైజీలు ఎగబడగా.. పంజాబ్‌ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో పంత్‌, శ్రేయస్‌ ఖరీదైన ఆటగాళ్లుగా నిలవగా.. ఇద్దరికీ తమ ఫ్రాంఛైజీలు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాయి.

కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా సూపర్‌ హిట్‌..  పంత్‌ విఫలం
అయితే, శ్రేయస్‌ ఇటు కెప్టెన్‌గా.. అటు బ్యాటర్‌గా సూపర్‌ హిట్‌ అయ్యాడు. గతేడాది 604 పరుగులు చేసిన ఈ ముంబైకర్‌ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు.. పంత్‌ మాత్రం దారుణంగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. గతేడాది కేవలం 269 పరుగులు చేసిన పంత్‌.. కెప్టెన్‌గానూ ఫెయిలై జట్టును ఏడోస్థానంలో నిలిపాడు.

ఇక తాజాగా ఐపీఎల్‌-2026లోనూ పంజాబ్‌ జైత్రయాత్ర కొనసాగిస్తుండగా.. లక్నో వరుస వైఫల్యాలతో సతమతమవుతూ ఉంది. ముల్లన్‌పూర్‌లో ఆదివారం ఇరుజట్లు తలపడగా.. పంజాబ్‌ లక్నోను 54 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న సంజీవ్‌ గోయెంకాకు పంజాబ్‌ అభిమాని దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చాడు.

రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి
‘‘గోయెంకా సాబ్‌! పంత్‌ను మీ జట్టులోకి తీసుకున్నందు వేలవేల దండాలు భాయ్‌.. అతడు పంజాబ్‌ కెప్టెన్‌గా రానందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఒకవేళ తదుపరి వేలంలో రూ. 32 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా దయచేసి పంత్‌ను మీతోనే ఉంచుకోండి’’ అని సదరు అభిమాని గట్టిగా అరిచాడు.

అయితే, ఇందుకు గోయెంకా మాత్రం థాంక్యూ అన్నట్లుగా నవ్వుతూ అభివాదం చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలం ముగిసిన తర్వాత రిషభ్‌ పంత్‌ చేసిన వ్యాఖ్యలే.. ఇప్పుడు ఒక రకంగా గోయెంకాకు ఎదురైన అవమానానికి కారణం.

ఆరోజు పంత్‌ అన్న మాటనే తిప్పి కొట్టి..
వేలం సందర్భంగా.. ‘‘నాకు ఒకటే టెన్షన్‌.. పంజాబ్‌కు మాత్రం అస్సలు వెళ్లకూడదు అని మొక్కుకున్నా.. నేను ఆడకూడదనుకునే ఒకే ఒక్క టీమ్‌ అది’’ అని పంత్‌ వ్యాఖ్యానించాడు. దీంతో అప్పటి నుంచి పంజాబ్‌ జట్టు ఫ్యాన్స్‌ అతడిపై గుర్రుగా ఉన్నారు. అందుకే ఇప్పుడు పంజాబ్‌లో పంజాబ్‌ చేతిలో పంత్‌ సేన ఓడిన తర్వాత గోయెంకాకు ఇలా పంత్‌ గురించి సలహా ఇచ్చారు.

చదవండి: BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!

Advertisement
 
Advertisement
Advertisement