లార్డ్స్‌ టెస్ట్‌లో అండర్సన్‌, బుమ్రా ఎపిసోడ్‌పై మంజ్రేకర్‌ సంచలన వ్యాఖ్యలు

Sanjay Manjrekar Suspects That Virat Kohli Might Have Asked Bumrah To Bowl Bouncers At James Anderson - Sakshi

లండన్‌: లార్డ్స్‌ టెస్ట్‌లో అండర్సన్‌, బుమ్రాల మధ్య జరిగిన ఆసక్తికర ఎపిసోడ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో బుమ్రా పాత్ర నామమాత్రమేనని, అతను చాలా అమాయకుడని, అసలు ఈ వివాదానికి తెరలేపింది టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లినేనని మంజ్రేకర్‌ ఆరోపించాడు. ఇంగ్లండ్ పేసర్ అండర్సన్‌ను రెచ్చగొట్టాలన్నది కోహ్లి ప్రణాళికలో భాగం అయ్యుండొచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి జట్టులో ప్రధాన ఆటగాడిని కవ్వించాలన్నది కోహ్లి ఉద్దేశం అయ్యుండొచ్చని, అందులో భాగంగానే అండర్సన్‌పైకి బుమ్రాను ఉసిగొల్పి ఉంటాడని పేర్కొన్నాడు. 

లార్డ్స్ టెస్ట్‌లో అండర్సన్‌, బుమ్రాల ఎపిసోడ్‌పై మంజ్రేకర్‌ స్పందిస్తూ.. అండర్సన్‌కు బుమ్రా 90 మైళ్ల వేగంతో బంతులు వేశాడని.. పుల్‌ లెంగ్త్‌, షార్ట్‌ పిచ్‌ బంతులతో అతని దేహాన్ని టర్గెట్‌ చేశాడని, అప్పటివరకు 80-85 మైళ్ల వేగంతో బంతులు సంధించిన భారత పేసు గుర్రం ఒక్కసారిగా వేగం పెంచాడని పేర్కొన్నాడు. సాధారణంగా ఇది బుమ్రా స్వభావం కాదని,  అతడు వేగంగా బంతులేస్తూ వికెట్లకు గురిపెడతాడని అన్నాడు. షార్ట్‌ పిచ్‌ బంతులు వేయాలన్నది బహుశా టీమిండియా కెప్టెన్ ప్రణాళిక అయ్యుంటుందని, దానిని బుమ్రా అమలు చేశాడని వ్యాఖ్యానించాడు.  

కాగా, లార్డ్స్‌ టెస్టులో భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్న సంగతి తెలిసిందే. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన జేమ్స్ అండర్సన్‌కు బుమ్రా షార్ట్‌ పిచ్‌ బంతులు వేయడంతో వివాదం మొదలైంది. కొన్ని బంతులు దేహానికి తగలడంతో అండర్సన్‌ ఆవేశపడ్డాడు. అతడికి సారీ చెబుదామని వెళ్లిన బుమ్రాను తోసేసి బూతులు తిట్టాడు. ఇది చీటింగ్‌ అని, ఉద్దేశపూర్వకంగా బంతితో భౌతిక దాడికి దిగావని ఆరోపించాడు. ఆ తర్వాతి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రాకు ఇంగ్లండ్ పేసర్లు కూడా అదే తరహాలో షార్ట్‌ పిచ్‌ బంతులను విసిరి గాయపర్చాలని భావించారు. కానీ అది కాస్తా బెడిసికొట్టింది. బుమ్రా, షమీ జోడీ తొమ్మిదో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు కూడా చెలరేగడంతో లార్డ్స్ టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో గెలుపొంది.. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య లీడ్స్‌ వేదికగా మూడో టెస్ట్‌ ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: చెన్నై జట్టులో 'జోష్‌'.. మరింత పదునెక్కిన సీఎస్‌కే పేస్‌ దళం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top