
బెంగళూరు వేదికగా మంగళవారం మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీ-2025 వేలం జరిగింది. ఈ వేలంలో - మైసూర్ వారియర్స్, హుబ్లి టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, గుల్బర్గా మిస్టిక్స్ మొత్తం ఆరు ఫ్రాంచైజీలు తమ కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్నాయి.
ఈ వేలంలో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌పై కాసుల వర్షం కురిసింది. అతడిని హుబ్లి టైగర్స్ రికార్డు స్థాయిలో రూ.13.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పడిక్కల్ నిలిచాడు. అదేవిధంగా హుబ్లి టైగర్స్ అభినవ్ మనోహర్‌ను సైతం రూ. 12.20 లక్షలకు సొంతం చేసుకుంది. హుబ్లి ఫ్రాంచైజీ వీరిద్దరిపైనే దాదాపు సగంపైగా మొత్తాన్ని ఖర్చుచేసింది. టీమిండియా వెటరన్, కేకేఆర్ ఆటగాడు మనీష్ పాండేను రూ. 12.20 లక్షలకు మైసూర్ వారియర్స్ దక్కించుకుంది.
సమిత్ ద్రవిడ్‌కు బిగ్ షాక్..
కాగా మహారాజా టీ20 వేలంలో భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ అమ్ముడుపోలేదు. రూ. 50 వేలు కనీస ధరతో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. సమిత్ ద్రవిడ్ గత ఎడిషన్‌లో మైసూరు వారియర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.
అయితే అంచనాలకు తగ్గటు జూనియర్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. గత సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన సమిత్.. 11.71 సగటుతో 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడు ప్రస్తుతం వేలంలో అమ్ముడు పోలేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ మెగా టోర్నీ బెంగళూరులోని ఐకానిక్ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆగస్టు 11 నుంచి 27 వరకు జరగనుంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ టోర్నీని ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఈవెంట్‌లో కరుణ్ నాయర్, ప్రసిధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఆడనున్నారు.