Special Story: ఉరికే జలపాతం.. ఉత్తుంగ తరంగం.. సెరీనా విలియమ్స్‌

Sakshi Funday Special Story On Serena Williams

ఉరికే జలపాతాన్ని.. ఉత్తుంగ తరంగాన్ని టెన్నిస్‌ కోర్ట్‌లో చూస్తున్నారంటే.. ఆ క్రీడ సెరీనా విలియమ్స్‌దే! 

క్రీడలు.. జీవనతత్వాన్ని బోధిస్తాయి..
దీన్ని గ్రహించినవారు ఓటమికి కుంగిపోరు.. 
గెలుపుకి పొంగిపోరు! 
అసలు గెలుపోటములనేవే లేవని.. ఎదురొడ్డి పోరాడడమే 
ముఖ్యమని విశ్వసిస్తారు!
ఆటల స్ఫూర్తిని బతుకు పోరుకు అన్వయించుకుని ఇటు జీవితంలో కానీ.. అటు మైదానంలో కానీ నిలబడ్డమే అచీవ్‌మెంట్‌గా భావిస్తారు.. 
అచీవర్స్‌గా మిగులుతారు! 
వాళ్లను పరిచయం చేసేదే 
ఈ కాలమ్‌!
ఈ వారం..
   సెరీనా విలియమ్స్‌

ఉరికే జలపాతాన్ని.. ఉత్తుంగ తరంగాన్ని టెన్నిస్‌ కోర్ట్‌లో చూస్తున్నారంటే.. 
ఆ క్రీడ సెరీనా విలియమ్స్‌దే! 
మణికట్టు బలానికి.. చురుకైన కదలికలకు సినినమ్‌ సెరీనానే!!
అమ్మ కడుపులోంచి ఆట భుజమ్మీద చేయ్యేసే భూమ్మీదకు వచ్చింది!
నాన్న వేలు పట్టుకుని ప్లే గ్రౌండ్‌కే తొలి అడుగులు వేసింది!
తాను కలలు కన్నది.. ఊహించిందీ టెన్నిస్‌ ప్రపంచాన్నే! 
అంతెందుకు ఆమె ఉచ్ఛ్వశించింది.. నిశ్వసించిందీ టెన్నిస్‌నే!
అలాంటి ఆటకు సెరీనా సెండాఫ్‌ ఇచ్చింది! ఊపిరి ఆగినంత పనయ్యుండదూ..! 
ఆమె చేతిలో దర్జా ఒలకబోసిన రాకెట్‌ తన మనసును రాయి చేసుకుని ఉంటుంది!!
ఆమె పాదాల లాఘవానికి ఆసరాగా నిలిచిన మైదానాలు బలహీనపడి ఉంటాయి!!
స్టేడియం గ్యాలరీలు నిస్తేజమయ్యుంటాయి!!  

సెరీనాకు తొమ్మిదేళ్లున్నప్పుడు ‘నీ ఆట ఎలా ఉండాలనుకుంటున్నావ్‌?’ అని అడిగారు.  ‘ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలనుకుంటున్నా’ అని చెప్పింది తొణక్కుండా బెణక్కుండా! చెప్పినట్టుగానే ప్రత్యర్థి ఎంతటి ఘటికులైనా సరే.. తన గెలుపునే ఎయిమ్‌గా సర్వీస్‌ చేసింది. ఆ బ్లాక్‌ పాంథర్‌.. కాలిఫోర్నియా, కాంప్టన్‌లో తన టెన్నిస్‌ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2022 సెప్టెంబర్‌ 2.. యూఎస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌తో ముగించేసింది. అక్క వీనస్‌ విలియమ్స్‌ ఇంకా ఆడుతుండగానే తాను నిష్క్రమించింది.  ‘రిటైర్మెంట్‌ పదం అంటేనే నాకు నచ్చేది కాదు. అదేదో మాట్లాడకూడని విషయంగా అనిపించేది.

నా భర్తతో, అమ్మానాన్నతో కూడా  దీని గురించి చర్చించలేదు ఎప్పుడూ! చాలామందికి రిటైర్మెంట్‌ ఒక ఆహ్లాదకరమైన విషయం కావచ్చు. నేనూ అంత తేలికగా తీసుకోగలిగితే ఎంత బావుండు అనిపించింది. ఒక ప్రవాహం నుంచి ఇంకో ప్రవాహానికి మళ్లుతున్న నేను.. అత్యంత ఉద్వేగభరితమైన  క్షణాన్ని ఎదుర్కొనే టైమ్‌ వచ్చినప్పుడు ఏడుపు ఆగలేదు. చెప్పలేనంత బాధ. ఇప్పటి వరకు నా జీవితంలో టెన్నిస్‌ తప్ప ఇంకోటి లేదు. రిటైర్మెంట్‌ ప్రకటనప్పుడు ఒంటరిగా వెళ్లేందుకు ధైర్యం చాల్లేదు. తోడుగా నా థెరపిస్ట్‌ను తీసుకెళ్లాను. రిటైర్మెంట్‌ను ప్రకటిస్తున్నప్పుడు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అనిపించింది. కుప్పకూలిపోయాను.

ఇలాంటి మలుపులో వచ్చి ఆగుతానని అనుకోలేదు. నా మూడో ఏటనే టెన్నిస్‌ బ్యాట్‌ను పట్టుకున్నానని మా నాన్న చెప్తూంటాడు. నాకు ఏడాదిన్నరప్పుడు మా అక్క (వీనస్‌) టెన్నిస్‌ కోర్ట్‌లో నన్ను తొట్టెలో తోసుకుంటూ వెళ్తున్న ఫొటో ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. నేను పర్‌ఫెక్షనిస్ట్‌ని. చిన్నప్పుడు నాకు ‘ఎ’ రాయడం రాకపోతే రాత్రంతా మేల్కొని దాన్ని దిద్దుతూనే ఉన్నా! ఏ పనినైనా కరెక్ట్‌గా నేర్చుకునే వరకు.. పర్‌ఫెక్ట్‌గా వచ్చేవరకు వదిలిపెట్టను.

ఆటకు సంబంధించి కూడా అంతే! నా శక్తిసామర్థ్యాలపై అపనమ్మకం ఉన్నవారికి వారి అభిప్రాయం తప్పు అని నిరూపించేందుకు మరింత ఉగ్రంగా ఆడాను. అవతల నుంచి వచ్చే నెగిటివిటీని నా బలంగా మార్చుకున్నాను. ఇప్పుడు టెన్నిస్‌కు ఆవల నేనేంటో తెలుసుకోవడానికి..నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను’ అని చెప్పింది సెరీనా ఒక ఇంటర్వ్యూలో!

రిటైర్మెంట్‌ అవసరం ఎందుకు వచ్చింది? 
సెరీనా తన ఐదేళ్ల కూతురు ఒలింపియాతో కార్‌లో వెళ్తోంది. అమ్మ ఫోన్‌తో ఆటలాడుకుంటోంది పాప. ‘పెద్దయ్యాక ఏమవుతావు’ అని ఫోన్‌లోని రోబో ప్రశ్న. అమ్మ వినకుండా గుసగుసగా చెప్తోంది ఒలింపియా, ‘నేను ఒక చిన్న చెల్లికి అక్కని అవుతా’ అని. ఆ మాట అమ్మ చెవిన పడనే పడింది. అంతేకాదు ఒలింపియా రోజూ దేవుడి ముందు తనకో చిన్ని చెల్లినివ్వమని వేడుకునే వేడుకోలూ ఆ అమ్మ కంట పడుతూనే ఉంది. ఐదుగురు అక్కల మధ్య పెరిగిన సెరీనాకి ఆ అనుబంధం అంటే ఏంటో బాగా తెలుసు. ఆ బలాన్ని ఒలింపియాకు ఇవ్వాలనుకుంది. ఇంకో బిడ్డకు జన్మనిచ్చే సమయం ఆసన్నమైందని అర్థమైంది.

అయినా టెన్నిస్‌ను వీడాలా అనే సందేహం! ‘టెన్నిస్‌.. కుటుంబం.. ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి?’ అనే డైలమా! తను స్త్రీ కాబట్టే ఈ సందిగ్ధతా? మగవాళ్లకు ఉంటుందా?  కుటుంబమా? కెరీరా అనే గుంజాటనపడే ఆగత్యం ఎదురవుతుందా? అతని అవసరాలు, ఇంటి అవసరాలు చూడ్డానికి, పిల్లల్ని పెంచడానికి భార్య ఉంటుంది. అన్నీ తానై భర్తకు అండగా నిలబడుతుంది.

అతని గెలుపు కోసం తను శ్రమిస్తుంది.. ప్రోత్సహిస్తుంది. అలాగని నేను మహిళనైనందుకు చింతించట్లేదు. ప్రతికూల పరిస్థితులనూ అవకాశాలుగా మలచుకోగల సత్తా ఉన్న మహిళగా నిలబడినందుకు గర్విస్తున్నాను.  సో.. కుటుంబాన్ని పెంచుకోవడం కోసం ఆటను వదులు కోవాలి.. కుటుంబం గురించి ఓ నిర్ణయం తీసుకోవాలసిన సమయమిది. కాబట్టి టెన్నిస్‌కు దూరం కాక తప్పదు.. దూరమవ్వాల్సిందే’ అని నిశ్చయించుకుంది. అలా  రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని తీసేసుకుంది సెరీనా. 

ఎంటర్‌ప్రెన్యూర్‌ సెరీనా 
కొన్నేళ్ల కిందట సెరీనా వెంచర్స్‌ అనే క్యాపిటల్‌ ఫర్మ్‌ను ఆంభించింది. 40 ఏళ్లు దాటిన మహిళలను పక్కన పెట్టేస్తుంది మార్కెట్‌. కానీ సెరీనా వెంచర్స్‌ మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా కేవలం మహిళా సాధికారత కోసమే పనిచేస్తోంది. ఒక ఆలోచనను కాని, డబ్బును కాని సెరీనా వెంచర్స్‌లో పెడితే దాన్ని ఒక ఉత్పత్తి కిందకు మారుస్తామని హామీ ఇస్తోంది ఆ ఫర్మ్‌. వోగ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వ్యాపారవేత్తగా తన పాత్రను చక్కగా వివరించారు సెరీనా. తాను ఒక స్పాంజ్‌ వంటి దాన్నని.. రాత్రి పడుకునే ముందు అప్పటిదాకా ఉన్న ఒత్తిడిని పిండి.. ఉదయానికి కొత్త ఉత్సాహంతో నిద్రలేస్తానని చెప్తుంది. 

ఈ  టెన్నిస్‌ లెజెండ్‌..  ఫ్యాషన్, స్టైల్‌ ఐకాన్‌ మాత్రమే కాదు మంచి ఇన్వెస్టర్‌ కూడా. నైజీరియన్‌ డాటా, ఇంటెలిజెన్స్‌ స్టార్టప్, ‘స్టియర్‌’లో 3.3 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. తన సెరీనా వెంచర్స్‌ కాకుండా వివిధ స్టార్టప్‌లలో, ముఖ్యంగా మహిళలు, నల్ల జాతీయుల అభివృద్ధికి పాటుపడే రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఇలా సెరీనా.. తన విజయాన్ని ఇతర మహిళల జీవితాలను మార్చడానికి వినియోగిస్తూ  స్త్రీ, పురుషులనే భేదం లేకుండా అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.  – శ్రీదేవి కవికొండల

హ్యాంగవుట్‌
‘పికిల్‌ బాల్‌ ఆట రానురాను మరింత ప్రాభవం సంపాదించుకుంటోంది. ఆ ఆట అంటే నాకు ఇష్టం. ఆడుతుంటే చాలా సరదాగా ఉంటుంది. ఏమో ఇది నా సెకండ్‌ కెరీర్‌ అవొచ్చేమో!’ అంటుంది సెరీనా! 

రిటైర్మెంట్‌ తర్వాత కొత్త ఉత్సాహంతో కనిపిస్తోంది ఆమె. మెక్సికోలో తన మేనకోడలి బ్యాచిలరేట్‌ పార్టీకి హాజరు అయి తానే కాబోయే పెళ్లికూతురు అన్నంతగా ఎంజాయ్‌ చేసింది. టీకప్పు పాటలతో క్యాంప్‌ ఫైర్‌ దగ్గర సెరీనా విలియమ్స్‌ ఆడిపాడిన వీడియో వైరల్‌ అయింది. 

సెరీనా జంతు ప్రేమికురాలు. ‘నాకు ఎవరైనా  కుక్కపిల్లను బహుమతిగా ఇస్తే హ్యాపీగా ఫీలవుతా. పిల్లి పిల్లలంటే కూడా ఇష్టమే కానీ పిల్లులంటే భయం. జుట్టు ఎక్కువ రాల్చని పెద్ద కుక్క ఏదైనా ఉంటే చెప్తారా’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను అడుగుతోంది సెరీనా. 

సెరీనా కోట్స్‌...
విజయవంతమైన ప్రతి మహిళ ఇంకొకరికి స్ఫూర్తి. మనం ఒకరికొరకం పైకి ఎదగడానికి సహాయం చేసుకోవాలి. సిస్టర్‌హుడ్‌ను పెంపొందించుకోవాలి. ధైర్యంగా, దృఢంగా, ఎంత సాధించినా ఒదిగి ఉండాలి. వయసు అనేది మైండ్‌సెట్‌ మాత్రమే.  చనిపోయేవరకు పని చేస్తూనే ఉండు.. పోరాడుతూనే ఉండు. నువ్వు ఎవరైనా, ఎలా ఉన్నా నిన్ను నువ్వు ప్రేమించుకో.. ఇతరులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉండు!!

  • 1995లో ప్రొఫెషనల్‌గా బరిలోకి దిగిన సెరీనా 1999 యూఎస్‌ ఓపెన్‌లో మొదటి సింగిల్స్‌ గెలిచింది. 23 సింగిల్స్‌ గెలిచి ప్రపంచంలో నంబర్‌ వన్‌గా నిలిచింది. 
  • అక్క వీనస్‌తో కలసి 14 డబుల్స్‌ గెలిచింది. ప్రపంచంలో డబుల్స్‌ నెంబర్‌ 1గా నిలిచారు ఆ అక్కాచెల్లెళ్లు. ఆటలో వాళ్లను కొట్టేవారే లేరు.  
  • ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు సాధించిన సెరీనా.. గెలిచినా, ఓడినా తన ఆటపై ఆమెకు బోలెడు ప్రేమ, నమ్మకం ఉంటాయి. 2017లో ఆమె ఆటను విమర్శించిన జర్నలిస్టుతో క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.
  • మహిళల్లో అందరి కంటే గొప్ప ప్లేయర్‌ ఎవరు అంటే సెరీనా విలియమ్స్‌ అని బల్లగుద్ది చెప్పవచ్చు. 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచినప్పుడు ఆమె రెండు నెలల గర్భవతి. ప్రసవం తర్వాత ఆరోగ్య సమస్యలతో గ్యాప్‌ తీసుకుని తిరిగి వచ్చినా హ్యామ్‌ స్ట్రింగ్‌ దెబ్బ తినడంతో 2022 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి విత్‌డ్రా కావలసి వచ్చింది. ఆఖరి ఆటలో కూడా సెరీనా అపజయాన్ని పొందింది. 
  • 2002 ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి 2003 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ వరకు ముఖ్యమైన నాలుగు సింగిల్స్‌ గెలుచుకుంది. తర్వాత గాయాల వలన కొంచెం జోరు తగ్గినా 2012లో వింబుల్డన్‌ చాంపియన్‌షిప్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.  
  • 2016, 2017 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న వందమంది ఫోర్బ్స్‌ జాబితాలో ఏకైక మహిళగా నిలిచింది సెరీనా. 
  • ‘నేను బిలియనీర్‌ని అయినా కూడా నన్ను ప్రజలు సెరీనా భర్తగానే గుర్తిస్తారు’ అంటూ ఆమె భర్త జోక్‌ చేస్తుంటాడు.. భార్య ఘనతకు మురిసి పోతుంటాడు. 
  • మహిళల్లో అందరి కంటే గొప్ప ప్లేయర్‌ ఎవరు అంటే సెరీనా విలియమ్స్‌ అని బల్లగుద్ది చెప్పవచ్చు. 2017 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచినప్పుడు ఆమె రెండు నెలల గర్భవతి. ప్రసవం తర్వాత ఆరోగ్య సమస్యలతో గ్యాప్‌ తీసుకుని తిరిగి వచ్చినా హ్యామ్‌ స్ట్రింగ్‌ దెబ్బ తినడంతో 2022 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి విత్‌డ్రా కావలసి వచ్చింది. ఆఖరి ఆటలో కూడా సెరీనా అపజయాన్ని పొందింది. 
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top