ఫీల్డింగ్‌, కీపింగ్‌, క్యాచ్‌.. ఆల్‌రౌండర్‌ ప్రదర్శన.. జట్టులో చోటుందా..!

Sachin Tendulkar Shares Video Of Dog Playing Cricket With Sharp Ball Catching Skills - Sakshi

సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులుగా.. శునకాన్ని పెంచుకోవడానికి  ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కుక్కను విశ్వాసానికి గుర్తుగా భావిస్తారు. చాలా మంది వీటిని.. తమ ఇంట్లో ఒక సభ్యుడి మాదిరిగానే ట్రీట్‌ చేస్తారు. శునకం కూడా తమ యజమాని పట్ల ఎనలేని ప్రేమను, అభిమానాన్ని చూపిస్తుంటుంది. బయటకు వెళ్లిన తమ యజమాని వచ్చేవరకు గుమ్మం వద్దనే కాచుకుని ఉంటాయి.

యజమాని తప్ప వేరే వారు ఏది తినడానికి పెట్టిన కనీసం ముట్టుకోవు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కుక్కలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. మరికొంత మంది కుక్కలకు చిన్నచిన్న పనులు నేర్పిస్తుంటారు.  ఏదైన వస్తువును లేదా బాల్‌ను విసిరి.. దాని వెనుక పరిగెడతారు. కుక్క నోటికి అందించి తెచ్చేలా దానికి ట్రైనింగ్‌ ఇస్తారు. ఇలాంటివి తరచుగా మనం సోషల్‌ మీడియాలోను.. మనచుట్టు చూస్తునే ఉంటాం.

తాజాగా, భారత్‌ మాజీ క్రికెట్‌ ప్లేయర్‌ సచిన్‌ టెండుల్కర్‌ ఒక ఆసక్తికర వీడియోను తన ట్విటర్‌ఖాతాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక వీధిలో కొందరు చిన్న పిల్లలు క్రికెట్‌ ఆడుతున్నారు. ఒక బాలిక లెఫ్ట్‌హ్యాండ్‌తో బ్యాటింగ్‌ చేస్తుంది. ఒక బాలుడు వేగంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అక్కడ ఒక శునకం కీపింగ్‌ చేస్తుంది. ఆ బాలుడు స్పీడ్‌గా బౌలింగ్‌ చేయగానే ఆ కుక్క.. దాన్ని తన నోటితో క్యాచ్‌ పట్టేసుకుంటుంది. అదే విధంగా ఆ బాలిక.. షాట్‌ కొట్టగానే వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ బాల్‌ను తీసుకొస్తుంది.

ఈ వీడియోలో శునకం.. కీపింగ్‌, ఫీల్డింగ్‌, క్యాచ్‌లతో.. ఆల్‌రౌండర్‌ ప్రతిభ కనబరుస్తుంది. ఈ ఆసక్తికర వీడియోను తన స్నేహితుడు పంపించినట్లు సచిన్‌ తెలిపాడు. ఆల్‌ రౌండర్‌ ప్రతిభ కనబరుస్తున్న శునకానికి మీరు ఏమని పేరుపేడతారంటూ సచిన్‌.. ట్యాగ్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని’, ‘ ఆల్‌ రౌండర్‌ శునకం’, ‘లగాన్‌ సినిమా గుర్తొస్తుందంటూ..’ కామెంట్‌లు చేస్తున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top