JSK Vs MICT: రషీద్‌ విఫలం.. ముగిసిన ఎంఐ కథ.. టోర్నీ నుంచి అవుట్‌.. మనకేంటీ దుస్థితి?

SA20 2023: JSK Beat MI Cape Town MICT Campaign Ends Fans Reacts - Sakshi

SA20, 2023 - Joburg Super Kings vs MI Cape Town: సౌతాఫ్రికా టీ20- 2023 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌ కథ ముగిసింది. ఆరంభ సీజన్‌లోనే ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌ 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఏడో పరాజయం నమోదు చేసిన ఎంఐ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

ఇక ఈ విజయంతో చెన్నై ఫ్రాంఛైజీకి చెందిన జోబర్గ్‌ ప్లే ఆఫ్స్‌నకు చేరుకుంది. కాగా జోహన్నస్‌బర్గ్‌ వేదికగా ది వాండరర్స్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఎంఐ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఆరంభంలోనే షాక్‌
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జోబర్గ్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. ఓపెనర్లు కెప్టెన్‌ డుప్లెసిస్‌, హెండ్రిక్స్‌ డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో ఎంఐ జట్టు సంబరాలు చేసుకుంది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన అన్‌క్యాప్డ్‌ ఇంగ్లిష్‌ బ్యాటర్‌ లూయీస్‌ డు ప్లూయీ వారి ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనీయలేదు.

ఆదుకున్న అన్‌క్యాప్ట్‌ బ్యాటర్‌
జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ 48 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 81 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిలిగిన వాళ్లలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మాథ్యూ వేడ్‌ 40 పరుగులతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జోబర్గ్‌ 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

రషీద్‌ విఫలం
ఎంఐ బౌలర్లలో లిండే ఒకటి, సామ్‌ కరన్‌ రెండు, జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు తీయగా.. డెవాల్డ్‌ బ్రెవిస్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఇక కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మిగతా ఎంఐ బౌలర్లతో పోలిస్తే.. 4 ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చి మ్యాచ్‌లో చెత్త గణాంకాలు నమోదు చేశాడు. 

చేతులెత్తేశారు 
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఎంఐ కేప్‌టౌన్‌ను జోబర్గ్‌ బౌలర్లు ఆది నుంచే దెబ్బకొట్టారు. ఓపెనర్‌ రాసీ వాన్‌ డసెన్‌ 20, వన్‌డౌన్‌లో వచ్చిన గ్రాంట్‌ రోల్ఫోసన్‌ 21 పరుగులు చేయగా.. నాలుగో స్థానంలో వచ్చిన బేబీ ఏబీడీ 27 పరగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 17.5 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్‌ అయిన ఎంఐ భారీ ఓటమిని మూటగట్టుకుంది.

హృదయం ముక్కలైంది
ఈ పరాజయంతో టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఎంఐ కేప్‌టౌన్‌ .. ‘‘మేము ఆరంభ సీజన్‌ను ఇలా ముగించాలనుకోలేదు. అయినా మేమంతా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం’’ అంటూ హృదయం ముక్కలైందంటూ హార్ట్‌ ఎమోజీని జత చేసింది.

మనకేంటీ దుస్థితి?
మరోవైపు.. జోబర్గ్‌ ప్లే ఆఫ్స్‌నకు దూసుకెళ్లి టైటిల్‌ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఐపీఎల్‌-2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

దీంతో ముంబై ఫ్యాన్స్‌ ఉసూరుమంటున్నారు. ‘‘గత కొన్నాళ్లుగా నిరాశే ఎదురవుతోంది. ఏ లీగ్‌లో కూడా ప్లే ఆఫ్స్‌ చేరుకోలేమా? మనకేంటీ దుస్థితి’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన రషీద్‌ ఖాన్‌.. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. పదింట ఎంఐ కేవలం మూడు విజయాలే నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.
చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top