రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌

Aaron Finch Announces Retirement, Ends Australia Career - Sakshi

Aaron Finch Retirement: కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు తొలి టీ20 వరల్డ్‌కప్‌ అందించిన స్టార్‌ ఓపెనర్‌ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఇదివరకే టెస్ట్‌, వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఫించ్‌.. పొట్టి ఫార్మాట్‌ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ వరకు కెరీర్‌ను కొనసాగించలేనని తెలిసే రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఫించ్‌ వెల్లడించాడు.

కెరీర్‌ ఆసాంతం తనకు మద్దతుగా నిలిచిన క్రికెట్‌ ఆస్ట్రేలియాకు, సహచరులకు, సహాయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. కెరీర్‌ ఎత్తుపల్లాల్లో తనకు అండగా నిలిచిన కుటుంబానికి, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. 2015 వన్డే ప్రపంచకప్, 2021లో టీ20 ప్రపంచకప్ గెలవడం తనకు చిరకాలం గుర్తుండిపోతుందని రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు.

కాగా, ఫించ్‌ సారధ్యంలో ఆసీస్‌ 2021 టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా తరఫున 5 టెస్ట్‌లు, 146 వన్డేలు, 103 టీ20లు ఆడిన ఫించ్‌.. 17 వన్డే సెంచరీలు, 2 టీ20 సెంచరీలు, 2 టెస్ట్‌ ఫిఫ్టీలు, 30 వన్డే ఫిఫ్టీలు, 19 టీ20 ఫిఫ్టీల సాయంతో 278 టెస్ట్‌ పరుగులు, 5406 వన్డే పరుగులు, 3120 టీ20 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు (172) ఫించ్‌ పేరిటే ఉంది. 

ఇదిలా ఉంటే, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023 ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సమయంలో ఫించ్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఫించ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ దేశవాలీ, క్లబ్‌, ఇతరత్రా లీగ్‌లకు అందుబాటులో ఉంటాడు. భారత్‌ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top