India Maharashtra International Challenge 2022: ఫైనల్లో రుత్విక శివాని

Ruthvika Shivani Enters Finals In India Maharashtra International Challenge 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియా మహారాష్ట్ర ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి దూసుకెళ్లింది. నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో రుత్విక శివాని 24–22, 21–17తో ఇషారాణి బారువా (భారత్‌)పై విజయం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో రుత్విక 25–23, 21–16తో మాన్సి సింగ్‌ (భారత్‌)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 18–21, 23–21, 21–9తో తారా షా (భారత్‌)పై, రెండో రౌండ్‌లో 21–14, 21–9తో ప్రణవి (భారత్‌)పై గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో జపాన్‌ ప్లేయర్‌ మిహో కయామతో రుత్విక శివాని తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మిహో కయామ 21–14, 21–15తో తస్నీమ్‌ మీర్‌ (భారత్‌)పై విజయం సాధించింది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కె.మనీషా–షేక్‌ గౌస్‌ (భారత్‌) జోడీ ఫైనల్‌ చేరింది. సెమీఫైనల్లో మనీషా–షేక్‌ గౌస్‌ ద్వయం 21–12, 19–21, 21–17తో బొక్కా నవనీత్‌–ప్రియా కొంజెంగ్‌బమ్‌ (భారత్‌) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో మైస్నమ్‌ మెరాబా (భారత్‌), మిథున్‌ మంజునాథ్‌ (భారత్‌) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో మైస్నమ్‌ మెరాబా 22–20, 21–14తో టాప్‌ సీడ్‌ కిరణ్‌ జార్జి (భారత్‌)పై, మిథున్‌ 22–24, 21–7, 21–18తో రవి (భారత్‌)పై గెలిచారు. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గరగ కృష్ణ ప్రసాద్‌ (భారత్‌) ద్వయం 12–21, 15–21తో చోలెంపన్‌–నాంథకర్న్‌ (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top