Sanju Samson: సంజూలో మంచి టాలెంట్‌ ఉంది.. సరైన రీతిలో వాడుకుంటాం: రోహిత్‌ శర్మ

Rohit Sharma Praise Sanju Samson Got Much Talent Crucial For T20 WC 2022 - Sakshi

Rohit Sharma On Sanju Samson: భారీ షాట్లు ఆడగల సత్తా అతనిది.. టాలెంట్‌.. టెక్నిక్‌లో అతనికి ఎదురులేదు.. ఐపీఎల్‌ లాంటి మెగాటోర్నీలో ఒంటిచేత్తో మ్యాచ్‌ల తలరాతను మర్చేవాడు.. రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా దుమ్మురేపిన ఆ ఆటగాడే సంజూ శాంసన్‌.

టీమిండియాలో మాత్రం సంజూ శాంసన్‌ మెరుపులు మెరిపించలేకపోయాడు. మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికి వాటిని నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత క్రమేపీ జట్టుకు దూరమయ్యాడు. తాజాగా శ్రీలంకతో సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ గాయపడడంతో అనూహ్యంగా సంజూ శాంసన్‌ జట్టులోకి వచ్చాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా సంజూ శాంసన్‌పై మంచి నమ్మకం పెట్టుకున్నాడు.

లంకతో తొలి టి20లో సూర్యకుమార్‌ స్థానంలో శాంసన్‌ మిడిలార్డర్‌లో ఆడే అవకాశం ఉందని.. రానున్న టి20 ప్రపంచకప్‌లో అతను కీలకమవుతాడని రోహిత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. బుధవారం మీడియా సమావేశంలో రోహిత్‌ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే సంజూ శాంసన్‌ తుది జట్టులో కచ్చితంగా ఉంటాడనిపిస్తుంది. మరి సంజూ ఈసారైన తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న 2022 టి20 ప్రపంచకప్‌కు టీమిండియాలో స్థానం దక్కించుకుంటాడేమో చూడాలి.

మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘'సంజు శాంసన్‌లో అసమాన ప్రతిభ ఉంది. అతని బ్యాటింగ్ చూసినప్పుడల్లా ఆనందం కలుగుతుంది.  అతనిలో ప్రతిభకు కొదువలేదు. అతన్ని మ్యాచ్‌లోకి తీసుకురావడం చాలా అవసరం. భారతదేశంలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. అయితే వాటిని మైదానంలో చూపించడం చాలా ముఖ్యమైన విషయం. సంజూ బ్యాక్‌ఫుట్ గేమ్ అద్భుతం. అతనిలో అన్ని రకాల షాట్లు ఆడగల సామర్థ్యం ఉంది. శాంసన్ ఆడే షాట్లు మిగతా బ్యాట్స్ మెన్స్ ఆడటం చాలా కష్టం. అలాంటి బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా వాతావరణానికి చక్కగా సరిపోతాడు. మేం అతన్ని సరైన రీతిలో వాడుకుంటాం. శాంసన్‌ తనకు ఇచ్చిన అవకాశాన్నిఉపయోగించుకుంటాడని ఆశిస్తున్నాను. శాంసన్‌కు మ్యాచ్‌లు గెలిపించే సత్తా ఉందని, అతనిపై జట్టు చాలా ఆశలు పెట్టుకుందంటూ'' చెప్పుకొచ్చాడు.

టీ20 ఇంటర్నేషనల్స్‌లో సంజూ శాంసన్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది. భారత్ తరపున 10 టీ20 మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. అతని బ్యాటింగ్ సగటు కేవలం 11.70గా నిలిచింది. శాంసన్ దూకుడు వైఖరి కారణంగా ఇలాంటి ఫలితాలు వచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు.

చదవండి: Alexander Zvere: మతి తప్పిన జ్వెరెవ్‌.. టోర్నీ నుంచి గెంటేసిన నిర్వాహకులు

BAN vs AFG: ఓడిపోతారన్న దశలో ప్రపంచ రికార్డు భాగస్వామ్యంతో గెలిపించారు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top