శ్రమించి ముందుకు...

Roger Federer into Wimbledon fourth round for 18th time - Sakshi

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌

నాలుగు సెట్‌ల పోరులో బ్రిటన్‌ ప్లేయర్‌ కామెరాన్‌ నోరీపై గెలుపు

లండన్‌: తనకెంతో అచ్చొచ్చిన వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ 18వసారి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 22వసారి ఆడుతోన్న ఫెడరర్‌కు మూడో రౌండ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. బ్రిటన్‌కు చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్‌ కామెరాన్‌ నోరీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో 39 ఏళ్ల ఫెడరర్‌ 6–4, 6–4, 5–7, 6–4తో గెలుపొందాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 27వ ర్యాంకర్‌ లొరెంజో సొనెగో (ఇటలీ)తో ఫెడరర్‌ తలపడతాడు. నోరీతో 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్‌ ఏడు ఏస్‌లు సంధించాడు.

ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయలేదు. నెట్‌ వద్దకు 38 సార్లు దూసుకొచ్చి 30 సార్లు పాయింట్లు గెలిచాడు. 48 విన్నర్స్‌ కొట్టిన ఫెడరర్‌ 33 అనవసర తప్పిదాలు చేశాడు. నోరీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసిన ఈ స్విస్‌ స్టార్‌ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. మరోవైపు కామెరాన్‌ నోరీ 12 ఏస్‌లు సంధించడంతోపాటు ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తాజా విజయంతో పాంచో గొంజాలెస్‌ (అమెరికా–41 ఏళ్ల వయసులో; 1969లో), కెన్‌ రోజ్‌వెల్‌ (ఆస్ట్రేలియా–40 ఏళ్ల వయసులో; 1975లో) తర్వాత వింబుల్డన్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన మూడో పెద్ద వయస్కుడిగా ఫెడరర్‌ గుర్తింపు పొందాడు.  

ఆండీ ముర్రే పరాజయం
మరోవైపు 2013, 2016 చాంపియన్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) కథ మూడో రౌండ్‌లో ముగిసింది. పదో సీడ్‌ షపవలోవ్‌ (కెనడా) 6–4, 6–4, 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ముర్రేను ఓడించి తొలిసారి వింబుల్డన్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6–7 (3/7), 6–4, 6–3, 7–6 (7/4)తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై నెగ్గాడు.  మరో మ్యాచ్‌లో ఏడో సీడ్‌ బెరెటిని (ఇటలీ) 6–4, 6–4, 6–4తో బెడెన్‌ (స్లొవేనియా)పై గెలిచాడు.

కోకో గాఫ్‌ జోరు
మహిళల సింగిల్స్‌లో 20వ సీడ్, అమెరికా టీనేజర్‌ వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. మూడో రౌండ్‌ మ్యాచ్‌లో కోకో గాఫ్‌ (అమెరికా) 6–3, 6–3తో కాయా యువాన్‌ (స్లొవేనియా)పై గెలిచింది. ఇంతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్‌ కెర్బర్‌ (జర్మనీ) 2–6, 6–0, 6–1తో సస్నోవిచ్‌ (బెలారస్‌)పై, 14వ సీడ్‌ క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7–6 (7/1), 3–6, 7–5తో సెవస్తోవా (లాత్వియా)పై, 19వ సీడ్‌ ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7–5, 6–3తో పావ్లుచెంకోవా (రష్యా)పై, పౌలా బదోసా (స్పెయిన్‌) 5–7, 6–2, 6–4తో లినెట్టి (పోలాండ్‌)పై గెలిచారు.

సానియా జంట ఓటమి
మహిళల డబుల్స్‌ రెండో రౌండ్‌లో సానియా మీర్జా (భారత్‌)–బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా) జోడీ 4–6, 3–6తో కుదెర్‌మెతోవా–వెస్నినా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top