IPL 2022: బీసీసీఐ కొత్త నిబంధన.. తీవ్ర నిరాశలో అభిమానులు

Reports: Sticks Attached Team Flags Not Allowed Stadium During IPL 2022 - Sakshi

బ్యాట్స్‌మన్‌ బౌండరీ లేదా సిక్స్‌ కొట్టినా.. బౌలర్‌ వికెట్‌ తీసినా లేదంటే ఒక జట్టు మ్యాచ్‌ గెలిచినా స్టేడియంలో ఉండే అభిమానులు సంబరాలు చేయడం సహజం. వారి చేతుల్లో ఉండే జెండాలను అటూ ఇటూ ఊపుతూ తమ జట్టుకు సంఘీభావంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇకపై అలా చేయడం కుదరదు.. జెండా కర్రలు స్టేడియాల్లో కనిపించకపోవచ్చు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికి నమ్మాల్సిందే.

ఐపీఎల్‌ మ్యాచ్‌ చూడడానికి వచ్చే ప్రేక్షకులు ఇకపై జెండాలు తీసుకురావడానికి వీలేదని.. ఒకవేళ తెచ్చినా పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది  జెండాలకు పెట్టిన కర్రలతో స్టేడియంలోని వారిపై దాడి చేసేందుకు ఆస్కారం ఉంటుందని, మైదానంలోకి వాటిని విసిరే ప్రమాదం ఉందని బీసీసీఐ పేర్కొంది. దాని వల్ల ప్రేక్షకులు లేదా ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ముందుజాగ్రత్త చర్యగా జెండాలను లోపలికి అనుమతించట్లేదని తెలిపింది. అయితే ఐపీఎల్‌ 2022 ముగిసేవరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

  

వాస్తవానికి కోవిడ్‌ మహమ్మారికి ముందు మామూలు పరిస్థితులే ఉండడంతో జట్టు యాజమాన్యాలే ప్లాస్టిక్ జెండాలను అరెంజ్ చేసేవి. ఇప్పుడు కరోనా నిబంధనల కారణంగా బీసీసీఐ నేరుగా మ్యాచ్ లను నిర్వహిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కర్ర జెండాలను బయటి నుంచి తీసుకువస్తుండడంతోనే జెండాలపై నిషేధం విధించారని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు చెప్పారు.

కాగా బీసీసీఐ, ముంబై పోలీసుల నిర్ణయంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. విరాట్ కోహ్లీకి పెద్ద అభిమాని అయిన చిరాగ్ ఖిలారే అనే వ్యక్తిని బుధవారం పోలీసులు స్టేడియం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కర్ర జెండాను బయట పడేసాకే లోపలికి అనుమతించారు. కాబట్టి బీసీసీఐ దీనిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏది ఏమైనా బీసీసీఐ తెచ్చిన కొత్త నిబంధన అభిమానులను ఇరకాటంలో పడేలా చేసింది.

చదవండి: IPL 2022: కోహ్లి స్టైల్లో బదోని సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top