Shahnawaz Dahani: ఎంపికయ్యానన్న సంతోషం.. తండ్రి సమాధి వద్ద బోరుమన్న క్రికెటర్‌

Reason Why Pak Cricketer Shahnawaz Dahani Rushed Fathers Grave-Cried - Sakshi

ఆసియాకప్‌లో భాగంగా గత ఆదివారం(ఆగస్టు 28న) భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వరుస వికెట్లు కోల్పోయి 120 పరుగులైనా చేస్తుందా అన్న దశలో 6 బంతుల్లో 2 సిక్సర్లు బాది 16 పరుగులు చేసిన షాహనాజ్‌ దహనీ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అతని ఇన్నింగ్స్‌ కారణంగానే పాక్‌ చివరకు 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌటైంది. మ్యాచ్‌ ఫలితం సంగతి పక్కనబెడితే.. పాకిస్తాన్‌ బౌలర్‌ షాహనాజ్‌ దహనీ గురించి ఒక ఆసక్తికర విషయం బయటపడింది.

ఏ ఆటగాడైనా సొంత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయాలని భావిస్తుంటాడు. తొలిసారి జట్టుకు ఎంపికయ్యామన్న వార్త తెలియగానే ఒక్కో ఆటగాడు ఒక్కోలా రియాక్ట్‌ అవుతుంటాడు. షాహనాజ్‌ దహనీ కూడా అదే రీతిలో స్పందించాడు. తొలిసారి పాక్‌ జట్టులోకి ఎంపికయ్యాడన్న విషయం తెలియగానే ఏడ్చేశాడు. ఆ తర్వాత తనకెంతో ఇష్టమైన తండ్రి భౌతికంగా లేనప్పటికి ఆయన సమాధి వద్దకు వెళ్లి బోరుమన్నాడట.

ఈ విషయాన్ని షాహనాజ్‌ దహనీనే స్వయంగా ఒక పాకిస్తాన్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వివరించాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఆడిన షాహనాజ్‌ దహనీ.. వికెట్‌ తీసిన ప్రతీసారి వింత సెలబ్రేషన్స్‌ చేసుకోవడం అలవాటు. ఆ అలవాటే ఇవాళ అతన్ని స్పెషల్‌ క్రికెటర్‌గా నిలబెట్టింది.  కాగా షాహనాజ్‌ తను జాతీయ జట్టులోకి ఎంపికైన విషయాన్ని వివరించాడు.

''ఏడాది క్రితం ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ముగించుకొని స్వస్థలమైన లర్ఖానాకు లాహోర్‌ నుంచి అప్పటికే జనంతో నిండిపోయిన బస్సులో వెళ్లాను. కనీసం నిలబడడానికి చోటు లేకుండా ఉన్న సమయంలో నా బ్యాగ్‌లో ఉన్న ఫోన్‌ మోగింది. ఎవరా అని హలో అనగానే.. అవతలి నుంచి.. పాకిస్తాన్‌ జట్టులోకి నిన్ను ఎంపికచేశాం.. వెంటనే ఇస్లామాబాద్‌కు వచ్చి రిపోర్ట్‌ చేయాలి అని పీసీబీ సెలెక్టర్లు సమాధానమిచ్చారు.

అంతే  నా తండ్రి గుర్తుకువచ్చి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యా. లర్కానా చేరుకున్న వెంటనే నా తండ్రి సమాధి వద్దకు వెళ్లి బోరుమని ఏడ్చాను. ఆ క్షణం ఏదో తెలియని ఆనందం. నేను కన్న కల నిజమైందన్న సంతోషాన్ని ఇంట్లోవాళ్లతో పంచుకున్నా. వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఊరి జనంలో నన్ను పొగడని మనిషి లేడు. ఇదంతా చూసి గర్వంగా అనిపించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. గతేడాది నవంబర్‌ 2021లో పాకిస్తాన్‌ జట్టులో ఎంట్రీ ఇచ్చిన షాహనాజ్‌ దహనీ పాక్‌ తరపున ఒక వన్డే, మూడు టి20లు ఆడాడు. 

చదవండి: సాయ్‌(SAI) మహిళా అధికారి నిర్వాకం.. వీడియో వైరల్‌

టీమిండియాతో అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌.. కళ్లన్నీ ఆ యువతిపైనే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top