సునీల్‌ నరైన్‌ ఔట్‌

RCB Won The Toss And Bat First Against KKR - Sakshi

షార్జా: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఇప్పటివరకూ కోల్‌కతా, ఆర్సీబీలు తలో ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలు సాధించాయి. ఇరుజట్లు వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. సీఎస్‌కేతో ఆడిన గత మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించగా,  కింగ్స్‌  పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలుపును అందుకుంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 24సార్లు తలపడగా కేకేఆర్‌ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆర్సీబీ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌కు కేకేఆర్‌ వివాదాస్పద స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ దూరమయ్యాడు. కింగ్స్‌ పంజాబ్‌తో ఆడిన గత మ్యాచ్‌లో నరైన్‌ బౌలింగ్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు అంపైర్లు ఫిర్యాదు చేశారు. దాంతో నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై తుది నివేదిక వచ్చే వరకూ అతను దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ క్రమంలోనే నరైన్‌ను ఈ మ్యాచ్‌ నుంచి తప్పించారు. మరి రాబోవు టోర్నీలో నరైన్‌ ఉంటాడా..లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ నరైన్‌ యాక్షన్‌ సరిగా లేదని తేలితే మాత్రం ఈ సీజన్‌ ఐపీఎల్‌కు దూరమవుతాడు.

కోహ్లి వర్సెస్‌ కమిన్స్‌
ఈ మ్యాచ్‌లో కోహ్లి-కమిన్స్‌ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. ఆర్సీబీ ఆడిన ఆరంభపు మ్యాచ్‌ల్లో తడబడిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ఆపై మంచి ఫామ్‌లోకి వచ్చాడు.  సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఓ మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టు గెలుపులో సహకరించాడు. ఆ మ్యాచ్‌లో అజేయంగా 90 పరుగులు సాధించి పెద్ద విజయాన్ని బెంగళూరుకు అందించాడు. కోహ్లి ఎదుర్కొన చివరి 22 డెలివరీల్లో  56 పరుగులు సాధించాడు. దాంతో  కోహ్లి మరోసారి మెరిసే అవకాశం ఉంది. ఇక కేకేఆర్‌ జట్టు పేస్‌ విభాగంలో కమిన్స్‌ కీలకం కానున్నాడు.

కమిన్స్‌ది కూడా కోహ్లి కథే. సీజన్‌ ఆరంభంలో తడబడ్డ కమిన్స్‌.. ఆపై బ్యాట్స్‌మెన్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. వికెట్లు సాధించకపోయినప్పటికీ కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లతో పరుగులు నియంత్రిస్తున్నాడు. కానీ వరల్డ్‌ బెస్ట్‌ బౌలర్లలో ఒకడైన కమిన్స్‌ ఏ క్షణంలోనైనా తన ట్రాక్‌ను అందుపుచ్చుకోవచ్చు. ఇప్పటివరరకూ తన స్థాయికి తగ్గ బౌలింగ్‌ వేయకపోయినప్పటికీ కమిన్స్‌తో ఆర్సీబీకి ప్రమాదం పొంచి ఉంది.  కమిన్స్‌ ఆరు మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు మాత్రమే తీయగా,  కోహ్లి ఆరు మ్యాచ్‌ల్లో 223 పరుగులు చేశాడు. ఇక్కడ కోహ్లి యావరేజ్‌ 55.75గా ఉండగా, స్టైక్‌రేట్‌ 128.90గా ఉంది. 

ఆర్సీబీ తుదిజట్టు
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, అరోన్‌ ఫించ్‌, దేవదూత్‌ పడిక్కల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శివం దూబే, క్రిస్‌ మోరిస్‌, ఇసురు ఉదాన, నవదీప్‌ సైనీ, మహ్మద్‌ సిరాజ్, చహల్‌

కేకేఆర్‌ తుదిజట్టు
దినేశ్‌ కార్తీక్‌, రాహుల్‌ త్రిపాఠి, శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌, టామ్‌ బాంటాన్‌, ఆండ్రీ రసెల్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాగర్‌కోటి, ప్రసిద్ద్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top