
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులోకి కొత్త ఆటగాడు చేరాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జేకబ్ బెతెల్ (Jacob Bethel) స్థానాన్ని యాజమాన్యం న్యూజిలాండ్ స్టార్ టిమ్ సీఫర్ట్ (Tim Seifert)తో భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఐపీఎల్-2025 వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే 17 నుంచి లీగ్ పునః ప్రారంభమైంది. అయితే, మధ్యలో విరామం వచ్చిన కారణంగా మే 25న జరగాల్సిన ఫైనల్.. జూన్ 3కు షెడ్యూల్ అయింది.
మే 24న స్వదేశానికి
ఈ నేపథ్యంలో జాతీయ జట్టు విధుల దృష్ట్యా పలు ఫ్రాంఛైజీలకు చెందిన విదేశీ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. జేకబ్ బెతెల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇంగ్లండ్ జట్టుతో చేరే క్రమంలో అతడు ఆర్సీబీని వీడనున్నాడు. మే 24న అతడు స్వదేశానికి వెళ్లనున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత జేకబ్ బెతెల్ ఆర్సీబీని వీడనున్నాడు.
సెంచరీ మిస్
ఈ క్రమంలో అతడి స్థానాన్ని కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్‌తో ఆర్సీబీ భర్తీ చేసింది. కాగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 66 మ్యాచ్‌లు ఆడిన టిమ్ సీఫర్ట్ 1540 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో పది అర్ధ శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 97. కాగా టిమ్ సీఫర్ట్ రూ. 2 కోట్ల ధరతో ఆర్సీబీలో చేరనున్నాడు. మే 24 నుంచి అతడు జట్టుకు అందుబాటులోకి వస్తాడు.
కాగా జేకబ్ బెతెల్ ఆర్సీబీ తరఫున ఈ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడి 67 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం (55) ఉండటం విశేషం. మరోవైపు ఆర్సీబీకి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం (మే 23) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, మంగళవారం (మే 27) లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటిదార్ సేన తలపడనుంది.
ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు
కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. ముంబై ఇండియన్స్ బుధవారం తమ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక టాప్-4లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ సేవలను ప్లే ఆఫ్స్‌లో కోల్పోనుంది. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై సిరీస్ నేపథ్యంలో బట్లర్ గుజరాత్‌కు దూరం కానున్నాడు.
మరోవైపు.. ఈ నెల 26 తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన రికెల్టన్, కార్బిన్ బాష్... ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ ముంబై జట్టును వీడనున్నారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ వారి స్థానాలను జానీ బెయిర్‌స్టో (రూ. రూ.5.25 కోట్లు), రిచర్డ్ గ్లీసన్ (రూ. కోటి)తో పాటు శ్రీలంక ఆటగాడు చరిత అసలంక (రూ. 75 లక్షలు)తో భర్తీ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు