
Ravichandran Ashwin: భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఆసీస్ పర్యటన సందర్భంగా రవిశాస్త్రి.. సహచర ఆటగాడు కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. పరోక్షంగా తనను కించపరిచే వ్యాఖ్యలు చేశాడని అన్నాడు. రవిశాస్త్రి చేసిన ఆ వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని, కదిలే బస్సు కింద తోసేసినట్లు అనిపించిందని వాపోయాడు. తాజాగా ఓ ప్రముఖ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ.. అశ్విన్ తన మనసులోని బాధను వెల్లగక్కాడు.
వివరాల్లోకి వెళితే.. 2018 ఆసీస్ పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్(నాలుగో టెస్ట్)లో కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన అనంతరం రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో కుల్దీప్ భారత నంబర్‌వన్ స్పిన్నర్ అని కొనియాడాడు.
రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలే తనను తీవ్రంగా బాధించాయని, బస్సు కింద తోసేసినట్లు అనిపించిందని అశ్విన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే, తాను బాధపడింది కుల్దీప్‌ను పొగిడినందుకు కాదని, ఆసీస్ గడ్డపై తనకు ఐదు వికెట్లు దక్కనందుకేనని చెప్పుకొచ్చాడు. కుల్దీప్ ప్రదర్శన పట్ల మనస్పూర్తిగా సంతోషించానని.. అయితే టీమిండియా గెలుపులో తన పాత్ర లేకపోవడం బాధించిందని, అందుకు తాను జట్టు గెలుపు సంబరాల్లో కూడా పాల్గొనకూడదని అనుకున్నట్లు వివరించాడు. ఆ సందర్భంలో తాను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచన కూడా చేసినట్లు అశ్విన్ పేర్కొన్నాడు.
చదవండి: దక్షిణాఫ్రికా పర్యటనకు అతన్ని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది..