Aakash Chopra: దక్షిణాఫ్రికా పర్యటనకు అతన్ని ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది..

IND Vs SA: Washington Sundar Not Included In The Squad Surprised Me Says Aakash Chopra - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన భారత టెస్ట్‌ జట్టును ఉద్ధేశించి మాజీ టీమిండియా ఓపెనర్‌, వివాదాస్పద వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడు టెస్ట్‌ల సిరీస్‌ నిమిత్తం సెలక్టర్లు ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత బృందంలో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ పేరులో లేకపోవడం ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. గాయాలపాలైన ఇద్దరు స్పిన్నర్లను(రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌) పక్కకు పెట్టిన సెలక్టర్లు.. వారిద్దరి స్థానాలను భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ.. కేవలం జయంత్‌ యాదవ్‌ను మాత్రమే ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. 

గాయం బారిన పడక ముందు సుందర్‌ టీమిండియా రెగ్యులర్‌ సభ్యుడని.. ప్రస్తుతం అతను గాయం నుంచి కోలుకుని ఫిట్‌గా ఉన్నప్పటికీ సెలక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోకపోవడం విడ్డూరంగా అనిపించిందని అన్నాడు. ఈ విషయమై సెలక్టర్లు వివరణ ఇవ్వాల్సి ఉందని డిమాండ్‌ చేశాడు. దక్షిణాఫ్రికాలో పరిస్థితుల దృష్ట్యా లెగ్‌ స్పిన్నర్‌ను ఎంపిక చేసే అవకాశం లేదని.. అలాగని కుల్దీప్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకోలేరని.. ఇలాంటి పరిస్థితుల్లో సుందర్‌కు కచ్చితంగా జట్టులో చోటు కల్పించాల్సి ఉండిందని అభిప్రాయపడ్డాడు. 

జయంత్‌ యాదవ్‌తో పోలిస్తే సుందర్‌కు బ్యాటింగ్‌లోనూ రాణించే సత్తా ఉంది కాబట్టి అతన్ని ఎంపిక చేసి ఉండడమే సరైన నిర్ణయమని అన్నాడు. కేవలం ముంబై టెస్ట్‌లో పర్వాలేదనిపించాడని జయంత్‌ యాదవ్‌ను ఎంపిక చేయడం ఏ మాత్రం సబబో చెప్పాలని సెలెక్టర్లను నిలదీశాడు. దక్షిణాఫ్రికాలో పరిస్థితుల దృష్ట్యా టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇ‍ద్దరు స్పిన్నర్ల ఫార్ములాతో బరిలోకి దిగే అవకాశం ఉంది కాబట్టి మూడో స్పిన్నర్‌గా సుందర్‌ను ఎంపిక చేయాల్సి ఉండిందని అన్నాడు. కాగా, గాయానికి ముందు సుందర్‌ ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. 
చదవండి: చరిత్ర సృష్టించిన షోయబ్‌ మాలిక్‌ మేనల్లుడు.. అరుదైన రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top