రంజీ ట్రోఫీ చరిత్రలో నాలుగో అత్యల్పం.. నాగాలాండ్‌ చెత్త రికార్డు

Ranji Trophy: Nagaland All-out For 25 Runs-Uttarakhand Won By 174 Runs - Sakshi

రంజీ ట్రోఫీలో నాలుగో అత్యల్ప స్కోరు నమోదైంది. 2022-23 రంజీ ట్రోఫీలో భాగంగా నాగాలాండ్ జట్టు అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్ 25 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా రంజీ చరిత్రలోనే నాలుగో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా రికార్డును సాధించింది. డిమాపుర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 25 పరుగులకే కుప్పకూలింది. కేవలం 18 ఓవర్లు మాత్రమే ఆడింది. ఉత్తరాఖండ్ బౌలర్లు మయాంక్ మిశ్రా, స్పప్నిల్ సింగ్ ఇద్దరే నాగాలాండ్ పతనాన్ని శాసించారు. ఫలితంగా ఉత్తరాఖండ్ 174 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

మయాంక్ మిశ్రా 9 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 ఓవర్లు మెయిడెన్లు కావడం విశేషం, మరోపక్క స్వప్నిల్ సింగ్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో 5 మెయిడెన్లు ఉన్నాయి. వీరిద్దరూ కలిపి 9 వికెట్లు తీయగా.. నాగాలాండ్ ఓపెనర్ యుగంధర్ సింగ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ జట్టు బ్యాటర్లలో నాగావో చిషి ఒక్కడే 10 పరుగులతో డబుల్ డిజిట్ స్కోరును అందుకోగలిగాడు. మిగిలివారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వీరిలో ఆరుగురు డకౌట్లుగా నిలవడం గమనార్హం.

1951-52 సీజన్‌లో ముంబయిపై సౌరాష్ట్రా చేసిన స్కోరును తాజాగా నాగాలాండ్‌ సమం చేసింది. ఇక రంజీ చరిత్రలో అత్యల్ప స్కోరు హైదరాబాద్ పేరిట ఉంది. 2010-11 సీజన్‌లో రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 21 పరుగులకే ఆలౌటైంది. ఇక 1934-33 సీజన్‌లో నార్తర్న్ ఇండియాపై సదరన్ పంజాబ్ జట్టు 22 పరుగులతో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. 23 పరుగులతో సింద్, జమ్మూ-కశ్మీర్ మూడో అత్యల్ప స్కోర్లు చేశాయి.

ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు ఇంగ్లాండ్‌లో నమోదైంది. 1810లో లార్డ్స్ ఓల్డ్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బీఎస్ జట్టు 6 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10 కంటే తక్కువ స్కోరు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా రంజీ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లలో నాగాలాండ్ కూడా చోటు దక్కించుకుంది. నాగాలాండ్ తన తదుపరి మ్యాచ్‌ను ఉత్తరప్రదేశ్, ఇలైట్ గ్రూప్-ఏతో ఆడనుంది.

చదవండి: బిగ్‌బాష్‌ లీగ్‌లో సంచలనం..15 పరుగులకే ఆలౌట్‌

రోహిత్‌ కోసం సెంచరీ చేసినోడిని పక్కనబెడతారా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top