IND Vs BAN: రోహిత్‌ కోసం సెంచరీ చేసినోడిని పక్కనబెడతారా?

Reports: Centurion-Shubman-Gill-Dropped-From-Final-Test-Vs-BAN For Rohit - Sakshi

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగినప్పటికి.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బాధ్యతగా ఆడాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో తొలి సెంచరీ అందుకున్న గిల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. 152 బంతులాడిన గిల్‌ 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి ఔటయ్యాడు.

అయితే తొలి సెంచరీ సాధించానన్న సంతోషం గిల్‌కు ఒక్కరోజైనా మిగలకుండానే ఒక వార్త హల్‌చల్‌ చేస్తుంది. గాయంతో తొలిటెస్టుకు దూరమైన రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెండో టెస్టుకు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ అధికారి ఒకరు శుక్రవారం ఉదయం మీడియాకు వెల్లడించాడు. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో చేతి వేలి గాయంతో బాధపడుతూనే లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 28 బంతుల్లో 51 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి బంగ్లాను కంగారెత్తించాడు. అయితే వేలి గాయంతో తొలి టెస్టుకు దూరమైన రోహిత్‌ బెంగళూరులోని ఎన్‌సీఏకు వచ్చాడు. తాజాగా హిట్‌మ్యాన్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని.. రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అయితే రోహిత్‌ శర్మ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రావడం కొంతమంది అభిమానులకు నచ్చడం లేదు. ఒకవేళ​ రెండో టెస్టులో రోహిత్‌ శర్మ ఆడితే అప్పుడు శుబ్‌మన్‌ గిల్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సిందే. డెబ్యూ సెంచరీతో ఆకట్టుకున్న గిల్‌.. రోహిత్‌ వస్తే మాత్రం పక్కకు తప్పుకోవాల్సిందే. ఎందుకంటే మూడో స్థానంలో పుజారా, నాలుగు, ఐదు స్థానాల్లో కోహ్లి, శ్రేయాస్‌ అయ్యర్‌లు ఉన్నారు. దీంతో ఎటొచ్చి గిల్‌ స్థానానికే ఎసరు పడేలా ఉంది. రోహిత్‌ కూడా పెద్దగా ఫామ్‌లో ఉన్నట్లు అనిపించడం లేదు.

బంగ్లాతో రెండో వన్డేలో ఏదో ఆఖర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినంత మాత్రానా టెస్టులో రాణిస్తాడని చెప్పలేం. అందుకే రోహిత్‌ కోసం సెంచరీ చేసిన శుబ్‌మన్‌ గిల్‌ను పక్కకు తప్పించడం కరెక్ట్‌ కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే అటు కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా విఫలమవుతున్న రోహిత్‌ శర్మను రెండో టెస్టులో ఆడించకపోయినా పర్వాలేదని మరికొంతమంది పేర్కొన్నారు. ఏది ఏమైనా ఒకవేళ​ రెండో టెస్టుకు రోహిత్‌ అందుబాటులోకి వస్తే మాత్రం గిల్‌ స్థానం పోయినట్లే.

ఇక తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. 512 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ మూడోరోజు ఆట ముగిసేసమయానికి వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. అంతకముందు శుబ్‌మన్‌ గిల్‌, పుజారాలు సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 258 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 150 పరుగులకు కుప్పకూలగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆటకు రెండు రోజుల సమయం మిగిలిఉన్న నేపథ్యంలో కచ్చితంగా ఫలితం వచ్చే అవకాశముంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top