తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనడం ఖరారైంది. మొహిసిన్ నఖ్వీ నేతృత్వంలోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రపంచకప్‌లో పాల్గొనే తమ జట్టు కోసం కొలొంబోకు (పాక్ తమ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇక్కడే ఆడుతుంది) విమానం టికెట్లు బుక్ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అన్నీ సిద్దం చేసుకొని పాక్ డ్రామాలు ఆడుతుంది.
ప్రపంచకప్‌లో పాల్గొనే అంశంపై తమ ప్రధాని ఫిబ్రవరి 2ను డెడ్‌లైన్‌గా విధించాడని మొహిసిన్ సొంత ప్రజల్నే ఫూల్స్ చేశాడు. పైకి డ్రామాలు ఆడుతూ, లోలోపల ప్రపంచకప్ బరిలోకి దిగేందుకు అన్నీ సిద్దం చేశాడు. పాక్ జట్టు ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుతో కలిసి (మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసిన తర్వాత) ప్రపంచకప్ కోసం కొలొంబోకు ప్రయాణించనుంది. ఈ విషయాన్ని టెలికామ్ ఏషియా బ్రేక్ చేసింది. ఇది తెలిసి పాక్ ప్రజలు నఖ్వీపై ఫైరవుతున్నారు.
ప్రపంచకప్‌లో పాల్గొనే అంశం ఎందుకు గోప్యంగా ఉంచారని నిలదీస్తున్నారు. దీనికి ప్రధాని డెడ్‌లైన్ విధించారని ఎందుకు డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ క్రికెట్‌కు నఖ్వీ వల్లే సగం దరిద్రం పట్టిందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
కాగా, పాక్ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అన్నీ సిద్దం చేసుకున్నా, భారత్‌తో మ్యాచ్ ఆడుతుందా లేదా అన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు. నఖ్వీ కదలికలు చూస్తే భారత్‌తో మ్యాచ్ బహిష్కరణపై సందేహాలు కలుగుతున్నాయి. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ టీమిండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్నది పాక్ వ్యూహంగా తెలుస్తుంది. ఇలా చేసి ఐసీసీ శిక్షల నుంచి తప్పించుకోవాలని పీసీబీ వ్యూహాలు రచిస్తున్నట్లు ఎన్‌డీటీవీ నివేదిక తెలిపింది. ఇదే జరిగితే పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య పేచీలో పాక్ ఎంటరై బంగ్లాదేశ్‌కు వత్తాసు పాడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. తదనంతరం పరిణామాల్లో పాక్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే ప్రపంచకప్ నుంచి తప్పుకుంటుందని ప్రచారం జరిగింది. తీరా చూస్తే పాక్ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు కొలొంబోకు టికెట్లు బుక్ చేసుకొని సొంత ప్రజల్నే ఫూల్స్ చేసింది.


