‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’ | Preity Zinta Slams Social Media Fake Stories About Punjab Kings-Players | Sakshi
Sakshi News home page

మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు: ప్రీతి జింటా

May 13 2026 11:32 AM | Updated on May 13 2026 1:53 PM

Preity Zinta Slams Social Media Fake Stories About Punjab Kings-Players

ఐపీఎల్ 2026 సీజ‌న్‌ను ఘ‌నంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ తొలి అంచె పోటీలు ముగిసేస‌రికి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజ‌యాల‌తో టేబుల్ టాప‌ర్‌గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో మాత్రం పంజాబ్ త‌డ‌బ‌డుతూ వ‌స్తోంది. వ‌రుస‌గా నాలుగు ప‌రాజ‌యాల‌తో పంజాబ్‌ ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి పడిపోయింది. 

బౌలింగ్‌లో విఫ‌లమ‌వ్వ‌డంతో పాటు పేల‌వ‌మైన ఫీల్డింగ్ ఆ జ‌ట్టు ప్ర‌మాణాల‌ను దెబ్బ తీస్తున్నాయి. పంజాబ్ ఆట‌గాళ్లు క్యాచ్ డ్రాప్‌లు ఎక్కువగా చేయ‌డం కూడా ఆ జ‌ట్టు కొంపముంచుతోంది. మైదానంలో ప‌రిస్థితి ఇలా ఉంటే బ‌య‌ట కూడా పంజాబ్ జ‌ట్టు చిక్కుల్లో ప‌డింది. ఇటీవ‌లే విమానంలో పంజాబ్ స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ వేప్ (ఈ-సిగ‌రేట్‌) పీల్చ‌డం వివాదంగా మారింది. 

వేప్‌ను అందించిన అర్ష్‌దీప్‌తో పాటు చాహ‌ల్‌, మ‌రికొంత మంది పంజాబ్ ఆట‌గాళ్ల‌పై వేటు ప‌డ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అంతేకాదు పంజాబ్ ఓపెన‌ర్ ప్ర‌బ్‌సిమ్ర‌న్ బ‌రువు పెరిగాడ‌న్న వార్త‌ల‌తో పాటు జ‌ట్టు ఆట‌గాళ్ల ప్ర‌వ‌ర్త‌న‌పై కూడా క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్ స‌హ య‌జ‌మాని ప్రీతి జింటా స్పందించింది. 

ఎక్స్ వేదిక‌గా ప్రీతి జింటా మాట్లాడుతూ..'మాటలు జాగ్రత్త. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది ప‌డితే అది వాగొద్ద‌ని హెచ్చ‌రించారు. ఇలాంటి త‌ప్పుడు క‌థ‌నాల వ‌ల్ల ఆట‌గాళ్లు, ఫ్రాంచైజీ ప్ర‌తిష్ట‌కు న‌ష్టం కలుగుతోంది. విమ‌ర్శ‌ల‌కు, త‌ప్పుడు క‌థ‌నాల‌కు మ‌ధ్య చాలా తేడా ఉంటుంది. ఆట‌లో త‌ప్పుల‌కు సంబంధించి ఎలాంటి చ‌ర్చ‌నైనా స్వాగ‌తిస్తాం. 

కానీ వ్య‌క్తులకు, జట్టుకు, ఫ్రాంచైజీ బ్రాండ్‌కు న‌ష్టం క‌లిగించేలా ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుడు క‌థ‌నాలు వ్యాప్తి చేస్తే ఎంత‌మాత్రం స‌హించ‌ము. వీటిని తేలిక‌గా తీసుకోలేము. స‌మాచారాన్ని ప్ర‌చారం చేసే ముందు వ్య‌క్తులు, మీడియా నిపుణులు, సోష‌ల్ మీడియా ప్ర‌తినిధులు వాస్త‌వాలు తెలుసుకొని బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నేను కోరుతున్నా' అని పేర్కొంది. 

ఇదే విష‌య‌మై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఎక్స్ వేదిక‌గా స్పందించిది. 'విమ‌ర్శ‌లు, స‌ర‌దా సంభాష‌ణ‌లు, అభిప్రాయాలు క్రీడ‌లో భాగమే. కానీ టీఆర్పీ, వ్యూస్ కోసం న‌కిలీ వార్త‌లు, క‌థ‌నాలు రాయ‌డం స‌రికాదు. త‌ప్పుడు స‌మాచారాన్ని వ్యాప్తి చేసే ముందు వాస్త‌వాలు ఏంట‌న్న‌ది గ్ర‌హించాల‌ని మేము కోరుతున్నాము' అని తెలిపింది.

చదవండి: హార్దిక్ నిజంగా గాయ‌ప‌డ్డాడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement