లార్డ్స్‌లో సచిన్‌ అపు‘రూపం’ | Portrait of legendary Indian cricketer unveiled | Sakshi
Sakshi News home page

లార్డ్స్‌లో సచిన్‌ అపు‘రూపం’

Jul 11 2025 4:22 AM | Updated on Jul 11 2025 4:25 AM

Portrait of legendary Indian cricketer unveiled

భారత దిగ్గజ క్రికెటర్‌ చిత్రపటం ఆవిష్కరణ  

లండన్‌: భారత విఖ్యాత క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ‘క్రికెట్‌ మక్కా’ లార్డ్స్‌ లో అరుదైన గౌరవం దక్కింది. మూడో టెస్టు మొదలైన సందర్భంగా లార్డ్స్‌’లోని మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) మ్యూజియంలో అతని చిత్రపటాన్ని ఆవిష్కరించారు. స్టువర్ట్‌ పియర్సన్‌ రైట్‌ అనే కళాకారుడు ఈ చిత్రరాజాన్ని గీశారు. 18 ఏళ్ల క్రితం సచిన్‌ ఇంట్లో తీసుకున్న ఫొటోను ఆధారంగా చేసుకొని లెజెండ్‌ అపు‘రూపాని’కి తన కుంచెతో వన్నెతెచ్చారు. 

సచిన్‌ చిత్రరాజం ఈ ఏడాది అక్కడే ఉంటుంది. ఆ తర్వాతే పెవిలియన్‌కు మార్చుతారు. క్రీడా దిగ్గజాల చిత్రాలను గీయడంతో పియర్సన్‌ రైట్‌ది అందెవేసిన చేయి. గతంలో అతను భారత లెజెండ్స్‌ కపిల్‌ దేవ్, బిషన్‌ సింగ్‌ బేడీ, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ చిత్రాలను గీశారు. గురువారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో సచిన్‌ తన సతీమణి అంజలీతో కలిసి పాల్గొన్నారు. ఇంగ్లండ్‌ మాజీ ప్రధాని రిషి సునాక్, దిగ్గజం ఫరూఖ్‌ ఇంజినీర్‌లు సైతం ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెండూల్కర్‌ మాట్లాడూతూ ‘నాకు దక్కిన అపూర్వ గౌరవమిది. 

1983లో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచినపుడే నాకు లార్డ్స్‌ గురించి తెలిసింది. మా కెప్టెన్ కపిల్‌ దేవ్‌ ప్రపంచకప్‌ను అందుకోవడం చూసిన ఆ క్షణమే నా క్రికెట్‌ ప్రయాణానికి నాంది పలికింది. ఈ రోజు నా చిత్రపటం పెవిలియన్‌కు వెళ్లినపుడు నా పయనం సంపూర్ణమైందనిపిస్తుంది. నా కెరీర్‌ను తలచుకున్న ప్రతిసారి నాకు నా ముఖంలో చిరునవ్వు కనబడుతుంది. నిజంగా ఇది ప్రత్యేకమైంది’ అని అన్నాడు. 

1950లో మొదలైన ఈ మ్యూజియం యూరోప్‌లోనే  పూరతనమైన క్రీడా మ్యూజియం. ఇందులో 3000 పైచిలుకు చిత్రమాలికలు కొలువుదీరగా... ఇందులో సుమారు 300 వరకు కుంచెనుంచి జాలువారిన చిత్రాలున్నాయి. మూడు దశాబ్దాల క్రితం ఈ పెయింటింగ్‌లను ప్రారంభించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement