పెనాల్టీ కిక్‌ల సమయంలో తీవ్ర ఒత్తిడి
స్టార్ ఆటగాళ్లకూ తప్పని వైఫల్యం
జర్మనీ జట్టులో నలుగురు సీనియర్ ప్లేయర్లు... గొరెట్జా, వాల్డమర్, బ్రౌన్, మెలిక్... పరాగ్వేతో పెనాల్టీ షూటౌట్ ఐదు ప్రయత్నాల్లో 3–3తో సమంగా నిలిచిన తర్వాత ఎవరు పెనాల్టీ తీసుకుంటారంటూ జర్మనీ కెప్టెన్ జోషువా కిమిక్ వీరందరినీ అడిగాడు... గొరెట్జానైతే దాదాపు బతిమాలినంత పని చేశాడు. కానీ ఒక్కరూ ముందుకు రాలేదు. దాంతో జొనాథన్ తాహ్ నేను ప్రయత్నిస్తానంటూ కిక్‌కు సిద్ధమయ్యాడు. అతని 51 మ్యాచ్‌ల అంతర్జాతీయ కెరీర్‌లో పెనాల్టీ కిక్ తీసుకోవడం ఇదే మొదటిసారి! తీవ్ర ఒత్తిడిలో అతను కొట్టిన బంతి బార్ మీదుగా వెళ్లిపోయింది. తర్వాత పరాగ్వే గోల్ కొట్టడంతో జర్మనీ ఓటమి ఖాయమైంది. షూటౌట్‌లో ఆటగాళ్ల పరిస్థితి ఏమిటో, వారిపై ఉండే ఒత్తిడి ఎలాంటి ఇది తాజా ఉదాహరణ. –సాక్షి క్రీడా విభాగం
ఫుట్‌బాల్‌లో పెనాల్టీ ‘షూటౌట్’ డ్రామాలను ఒక రకంగా ‘అమానవీయం’గా వ్యవహరిస్తుంటారు. సుదీర్ఘ సమయం పాటు మైదానంలో హోరాహోరీగా పోరాడి అలసిన తర్వాత మళ్లీ కొత్త సవాల్‌కు సిద్ధం కావడం ఆటగాళ్లకు కష్టంగా మారిపోతుంది. తమ దేశం తరఫున అంచనాల భారం మోస్తూ బరిలోకి దిగిన ప్లేయర్లపై షూటౌట్ సమయంలో మరింత తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. షూటౌట్‌లో ఆట మాత్రమే కాకుండా కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ప్లేయర్లుగా గుర్తింపు పొందిన వాళ్లు కూడా షూటౌట్‌లో తడబాటుకు లోనవుతారు.
ఇతర ఆటగాళ్లలాగే ఈ సమయంలో గోల్ చేయడంలో వారు కూడా విఫలమయ్యే అవకాశాలు అంతే సమానంగా ఉంటాయి. అప్పటి వరకు అద్భుతంగా ఆడినా సరే... కిక్‌లో విఫలం అయితే వారంతా ఒక్కసారిగా విలన్లుగా మారిపోవడం ఖాయం. తాజా ‘ఫిఫా’ ప్రపంచ కప్ రౌండ్–32లో తొలి రెండు మ్యాచ్‌లలో ఫలితం పెనాల్టీ షూటౌట్‌ల ద్వారానే వచ్చింది. ఇందులో దిగ్గజ జట్టు జర్మనీ, మరో పటిష్ట యూరోపియన్ టీమ్ నెదర్లాండ్స్... బలహీనులనదగ్గ పరాగ్వే, మొరాకో చేతుల్లోపరాజయం పాలయ్యాయి.
గొప్ప ఆటగాళ్లూ విఫలమై...
ఫుట్‌బాల్‌లో షూటౌట్‌లను 1970లో ప్రవేశపెట్టారు. 1994లో తొలిసారి షూటౌట్ ద్వారా ప్రపంచ కప్ విజేతను నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో ఇటలీపై బ్రెజిల్ పైచేయి సాధించింది. ఇటలీ దిగ్గజ ఆటగాడు రాబర్టో బాగియో ఈ షూటౌట్‌లో గోల్ కొట్టలేకపోవడం సాకర్ చరిత్రలోనే అత్యంత దురదృష్టకర క్షణాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ‘షూటౌట్ సమయంలో ఆటగాళ్లపై అతి తీవ్రంగా ఒత్తిడి ఉంటుంది. ఇది అమానవీయ స్థాయికి చేరిపోతుంది. ముఖ్యంగా కిక్ తీసుకునే ఆటగాళ్లపై అందరి దృష్టీ ఉంటుంది. దీనిని అధిగమించి స్కోర్ చేయడం చాలా కష్టం’ అని నార్వేకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ గియర్ జార్డెట్ అభిప్రాయ పడ్డారు.
పెనాల్టీ స్పాట్ నుంచి గోల్ లైన్ వరకు ఉండే 11 మీటర్ల దూరంలో ఆటగాళ్ల భవిష్యత్తు నిర్ధారితమవుతుందని ఇంగ్లండ్ ఆటగాడు నోని మడుకె అన్నాడు. 2022 ఖతర్ వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లు పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లగా... అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఫలితం కూడా దాంతోనే తేలిన విషయాన్ని అతను గుర్తు చేశాడు.
ఒత్తిడిని అధిగమిస్తేనే...
పెనాల్టీ కిక్‌ను తీసుకోవడంలో ఒక్కో ఆటగాడికి ఒక్కో శైలికి ఉంటుంది. కొందరు ఎక్కువ సమయం తీసుకోకుండా వేగంగా ముందుకు దూసుకొచ్చి కిక్ కొడితే, మరికొందరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని అప్పుడు కిక్ తీసుకుంటారు. కాస్త ఆగినట్లుగా చేస్తూ కీపర్ బోల్తా కొట్టేలా ఎదురు చూసి తమ పని పూర్తి చేసుకునే శైలి మరికొందరు ఆటగాళ్లది. అయితే ఎలా చేసినా అతను గోల్ కొట్టాలనే తీవ్రమైన ఒత్తిడి మాత్రం కచ్చితంగా ఉంటుంది.
‘రిఫరీ విజిల్ వేయగానే కిక్ కొట్టే వారు ఎక్కువగా విఫలం కావడం కనిపిస్తుంది. ఒత్తిడి తగ్గే వరకు కాస్త ఆపై వెళ్లేవారికి మంచి ఫలితాలు రావడం మేం చూశాం. అయితే పెనాల్టీ కిక్ తీసుకోవాలంటే చాలా గుండె ధైర్యం మాత్రం ఉండాల్సిందే. అది అంత సులువు కాదు. గోల్‌కీపర్లు మాత్రం ఈ విషయంలో అనుభవం కొద్దీ రాటుదేలుతారు’ అని అమెరికా ఫార్వర్డ్ క్రిస్టియాన్ ప్యులిసిక్ విశ్లేషించాడు. 2022 వరల్డ్ కప్ ఫైనల్ సహా అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ గత ఆరు పెనాల్టీ షూటౌట్‌లోనూ ప్రత్యర్థిని నిలువరించడం విశేషం.
ఆటగాళ్ల ఎంపికే కీలకం...
షూటౌట్‌లో ఆటగాళ్లను ఎంపిక చేయడం కూడా కోచ్‌కు పెద్ద సవాల్‌గా మారుతుంది. ఎవరిని ఎంచుకున్నా అది సాహసోపేత నిర్ణయమే అవుతుంది. ఆటగాడిగా పేరు, అనుభవం మాత్రమే కాకుండా ఆ సమయంలో కొట్టగలడనే నమ్మకం కూడా ఉండాలి. మెస్సీ, ఎంబాపెలాంటి ఆటగాళ్లు మరో ఆలోచన లేకుండా షూటౌట్‌కు సిద్ధం కావడం సహజమే కానీ ఇతర ఆటగాళ్ల విషయంలోనే సమస్య వస్తుంది. టెక్నిక్‌తో పాటు పెనాల్టీ కిక్‌ల విషయంలో కూడా రిహార్సల్స్ చేయడం అవసరమనేది నిపుణుల అభిప్రాయం.
తాజాగా పరాగ్వేతో జర్మనీ మ్యాచ్ అందుకు సరైన ఉదాహరణ. సీనియర్ ప్లేయర్లు కూడా ముందుకు రాలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. పేరు ప్రతిష్టలతో కాకుండా తాను గోల్ కొడతాననే ఆత్మవిశ్వాసం ప్రదర్శించే ఆటగాళ్లపై నమ్మకం ఉంచవచ్చని... అయితే స్వచ్ఛందంగా రమ్మని అడగకుండా కోచ్‌లు ఎంపిక చేయడమే సరైన పద్ధతి అని ప్యులిసిక్ వ్యాఖ్యానించాడు. ఈ ప్రపంచకప్‌లో మున్ముందు ఎన్ని మ్యాచ్‌లలో ‘షూటౌట్’ రాత మారుస్తుందనేది ఆసక్తికరం.


