PKL 11: తమిళ్‌ తలైవాస్‌ దూకుడు.. గుజరాత్‌ చిత్తు | PKL 11 OCT 30th 2024: Tamil Thalaivas Thrashes Gujarat Giants By 44 25 | Sakshi
Sakshi News home page

PKL 11: గుజరాత్‌ను చిత్తు చేసిన తలైవాస్‌.. అగ్రస్థానంలో

Oct 30 2024 9:35 PM | Updated on Oct 30 2024 9:39 PM

PKL 11 OCT 30th 2024: Tamil Thalaivas Thrashes Gujarat Giants By 44 25

సాక్షి, హైదరాబాద్‌: గుజరాత్‌ జెయింట్స్‌పై తమిళ్‌ తలైవాస్‌ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 44-25తో చిత్తు చేసింది. తద్వారా ఏకంగా 19 పాయింట్ల భారీ తేడాతో గుజరాత్‌పై తమిళ్‌ తలైవాస్‌ గెలుపొందింది. సీజన్‌లో మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి ఎగబాకింది. మరోవైపు..ఈ సీజన్‌లోనాలుగు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌ జెయింట్స్‌కు ఇది మూడో పరాజయం.

కాగా గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌.. గుజరాత్‌తో తలపడింది అదరగొట్టింది.   తలైవాస్‌ స్టార్‌ రెయిడర్‌ నరేందర్‌ 20 సార్లు కూతకెళ్లి 15 పాయింట్లు సాధించగా.. సచిన్‌ (5 పాయింట్లు), డిఫెండర్‌ నితేశ్‌ కుమార్‌ (4 పాయింట్లు), ఆమీర్‌ ( 4 పాయింట్లు) రాణించారు. గుజరాత్‌ జెయింట్స్‌ ఆటగాళ్లలో గుమన్‌ సింగ్‌ ఏడు పాయింట్లు సాధించగా, రాకేశ్‌ మూడు పాయింట్లతో మెరిశాడు.

ఆకట్టుకున్న తలైవాస్‌..
మ్యాచ్‌ప్రథమార్థం తొలి పది నిమిషాల్లో ఆధిపత్యం కోసం ఇరు జట్లు గట్టిగా పోటీపడ్డాయి. అయితే, 11-9తో తమిళ్‌ తలైవాస్‌ పైచేయి సాధించింది. కానీ గుజరాత్‌ జెయింట్స్‌ రెట్టించిన ఉత్సాహంతో పోరాడింది. డిఫెన్స్‌లో తలైవాస్‌తో సమవుజ్జీగా నిలిచినా.. రెయిడింగ్‌లో జెయింట్స్‌ వెనుకంజ వేసింది.  

తలైవాస్‌ స్టార్‌ రెయిడర్‌ నరేందర్‌, సచిన్‌ మెరువగా.. గుజరాత్‌ జెయింట్స్‌ రెయిడర్లలో గుమన్‌ సింగ్‌ మాత్రమే మెప్పించాడు. దీంతో ప్రథమార్థం ఆట ముగిసేసరికి తమిళ్‌ తలైవాస్‌ 18-14తో నాలుగు పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది.

తలైవాస్‌ దూకుడు..
విరామం అనంతరం తమిళ్‌ తలైవాస్‌ దూకుడు పెంచింది. తొలి 20 నిమిషాల్లో సాధించిన ఆధిక్యాన్ని.. ద్వితీయార్థంలో తొలి పది నిమిషాల్లోనే సొంతం చేసుకుంది. ప్రథమార్థంలో ఆలౌట్‌ కాకుండా జాగ్రత్త పడిన గుజరాత్‌ జెయింట్స్‌ సెకండ్‌ హాఫ్‌లో చేతులెత్తేసింది.

జెయింట్స్‌ కోర్టు ఖాళీ చేసిన తలైవాస్‌ విలువైన ఆలౌట్‌  పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఆఖరు నిమిషంలో గుజరాత్‌ జెయింట్స్‌ను మరోసారి ఆలౌట్‌ చేసిన తమిళ్‌ తలైవాస్‌ ఏకపక్ష ప్రదర్శన చేసింది.  చివరి 20 నిమిషాల ఆటలో తమిళ్‌ తలైవాస్‌ 26 పాయింట్లు సాధించగా, గుజరాత్‌ జెయింట్స్‌ కేవలం 11 పాయింట్లే సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement