Asia cup 2022: భారత్‌ రికార్డు బద్దలు కొట్టిన పాకిస్తాన్‌.. ప్రపంచంలోనే రెండో జట్టుగా!

Pakistan displace India in elite list after huge 155run victory over Hong Kong - Sakshi

అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్‌ అరుదైన ఘనత సాధించింది. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన రెండో జట్టుగా పాకిస్తాన్‌ రికార్డులకెక్కింది. ఆసియాకప్‌-2022లో భాగంగా హాంగ్‌ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 155 పరుగుల తేడాతో విజయ భేరి మోగించింది.

తద్వారా రికార్డును పాకిస్తాన్‌ తన ఖాతాలో వేసుకుంది. కాగా అంతకుముందు 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో స్ధానంలో ఉండేది. తాజా మ్యాచ్‌తో భారత్‌ రికార్డును పాకిస్తాన్‌ బ్రేక్‌ చేసింది.

ఇక ఈ ఘనత సాధించిన జాబితా(ఐసీసీ ఫుల్‌ మెంబర్స్‌)లో శ్రీలంక మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2007లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 172 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

సూపర్‌-4లో అడుగుపెట్టిన పాకిస్తాన్‌
ఇక హాంగ్‌ కాంగ్‌పై ఘన విజయం సాధించిన పాకిస్తాన్‌ గ్రూప్‌-ఎ నుంచి సూపర్‌-4లో అడుగుపెట్టిన రెండో జట్టుగా నిలిచింది. కాగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. పాక్‌ బ్యాటర్లలో మహ్మద్‌ రిజ్వాన్‌(78 పరుగులు నాటౌట్‌), ఫఖర్‌ జమాన్‌(53), కుష్‌దిల్‌ షా(35) పరుగులతో రాణించారు.

అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్‌ కాంగ్‌ కేవలం 38 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు తీయగా.. మహ్మద్‌ నవాజ్ ‌ మూడు, నసీమ్‌ షా రెండు, దహినీ ఒక వికెట్‌ తీశారు. ఇక సూపర్‌-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్‌ 4న) భారత్‌తో పాకిస్తాన్‌ తలపడనుంది.
చదవండిAsia Cup 2022: ఇదేం బౌలింగ్‌ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్‌దిల్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top