ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఎప్పుడైనా మేం సిద్ధమే: బీసీసీఐ

Once Cricket Is Added To Olympics India Will Be Participating Says BCCI Secretary Jay Shah - Sakshi

న్యూఢిల్లీ: జెంటిల్మెన్​ గేమ్ క్రికెట్‌ను విశ్వక్రీడల్లో భాగం చేస్తే బాగుంటుందనే అభిప్రాయం చాలా రోజులుగా వ్యక్తమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 లాస్ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో ఆ ముచ్చట కూడా తీరనుంది. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) క్రికెట్‌ అభిమానులకు శుభవార్త చెప్పింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎప్పుడు చేర్చినా తాము సిద్ధమేనంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ఐసీసీతో కలిసి బీసీసీఐ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని పేర్కొన్నారు. 

కాగా, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని గతంలోనే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(ఐఓసీ)తో ఐసీసీ చర్చలు జరిపింది. అయితే, అప్పుడు బీసీసీఐ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆ ప్రయత్నాలు అర్ధంతరంగా ముగిశాయి. కానీ, ప్రస్తుతం బీసీసీఐ సానుకూలంగా స్పందించడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. 

అన్నీ సజావుగా సాగితే.. 2028 లాస్​ ఏంజెల్స్‌​​ ఒలింపిక్స్​లో ఐసీసీ ఎనిమిది జట్లను బరిలో దించే అవకాశముంది. బీసీసీఐ.. భారత పురుష, మహిళల జట్లను బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫార్మాట్‌ విషయానికొస్తే.. టీ20 లేదా టీ10 తరహాలో అతి చిన్న ఫార్మాట్​వైపు మొగ్గు చూపే ఆస్కారం ఉంది.

కాగా, 1900 పారిస్ ​ఒలింపిక్స్​లోనే క్రికెట్​ భాగంగా ఉండింది. ఆప్పుడు జరిగిన ఏకైక మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్​, ఫ్రాన్స్ జట్లు తలపడ్డాయి. ఇందులో గ్రేట్​ బ్రిటన్​ స్వర్ణం నెగ్గగా, ఫ్రాన్స్​కు రజతం దక్కింది. అయితే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ప్రాతినిధ్యం కల్పించడం అదే చివరిసారి. విశ్వక్రీడల్లో ఆధిపత్యం చెలాయించే అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, జపాన్​ లాంటి దేశాలు క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో జెంటిల్మెన్‌ గేమ్‌ను విశ్వక్రీడల నుంచి తొలగించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top