New Zealand Cricket: కివీస్‌ క్రికెట్లో ‘సమ’శకం.. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు

NZ Female Cricketers Will Earn Same Match Fees Like-Men For 5-year Deal - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: ప్రపంచ క్రికెట్లో సమ, నవ శకానికి న్యూజిలాండ్‌ క్రికెట్‌ (ఎన్‌జెడ్‌సీ) నాంది పలికింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆధిపత్యం చలాయిస్తున్న పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు, కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు ఎన్‌జెడ్‌సీ ప్రకటించింది. దీనికి సంబంధించిన విధాన నిర్ణయాన్ని వెలువరించింది. వచ్చే ఐదేళ్ల కాంట్రాక్టులో నూతన సమాన వేతనాలను ఒక్క అంతర్జాతీయ క్రికెట్‌కే పరిమితం చేయకుండా ఎన్‌జెడ్‌సీ బోర్డు దేశవాళీ క్రికెట్లోనూ ప్రవేశపెట్టడం నిజంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడమే! ఇప్పుడు కివీస్‌ స్టార్లు విలియమ్సన్‌ సహచరులకు ఎంత మొత్తం లభిస్తుందో... సోఫీ డివైన్‌ బృందం కూడా అంతే మొత్తం మ్యాచ్‌ ఫీజులు, వేతన భత్యాలు పొందుతుంది.  


శాసించే చోట సమానత్వం 
అంతర్జాతీయ క్రికెట్‌ అంటేనే పురుషుల క్రికెట్‌. అది ప్రపంచకప్‌ అయినా... యాషెస్‌ సిరీస్‌ అయినా... ఆసియా కప్‌ అయినా పురుషాధిక్యమే మైదానంలో మెరుపుల్ని మెరిపిస్తుంది. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లను జమచేసుకుంటుంది. ఇలా శాసించే చోట సమానత్వం కొత్త ఒరవడే కాదు... ఆ బోర్డు చేసే సాహసమే! పురుషుల సిరీస్‌లకు వచ్చేంత రాబడి మహిళల ప్రపంచకప్‌కు రాదు.

అయినప్పటికీ న్యూజిలాండ్‌ సమాన చెల్లింపుల విధానంతో ఏకంగా ఐదేళ్లు కాంట్రాక్టు ఇవ్వడం అనేది క్రికెట్‌లో పెద్ద సంచలనం. ఎన్‌జెడ్‌సీ ఫీజులను పరిశీలిస్తే ఒక్కో టెస్టుకు 10,500 న్యూజిలాండ్‌ డాలర్లు (రూ. 5 లక్షల 11 వేలు), ఒక్కో వన్డేకు 4,000 డాలర్లు (రూ. లక్షా 94 వేలు), ఒక్కో టి20 మ్యాచ్‌కు 2,500 డాలర్లు (రూ. లక్షా 21 వేలు) చెల్లిస్తారు. అయితే న్యూజిలాండ్‌ అమ్మాయిల జట్టు 2004 నుంచి ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top