కోహ్లి, రోహిత్‌ కాదు! నా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: లారా

Not Kohli Or Rohit Brian Lara Backs India Batter To Break His Test World Record - Sakshi

టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌పై వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. ఆధునిక తరం క్రికెటర్లలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ అత్యంత ప్రతిభావంతుడని కొనియాడాడు. తన ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టగల సత్తా కేవలం గిల్‌కు మాత్రమే ఉందంటూ అతడిని ఆకాశానికెత్తాడు. 

మూడు ఫార్మాట్లలో టీమిండియా ఓపెనర్‌గా పాతుకుపోయిన శుబ్‌మన్‌ గిల్‌.. టెస్టు, వన్డే, టీ20లలో ఇప్పటికే సెంచరీలు నమోదు చేశాడు. తనదైన శైలిలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ పంజాబీ బ్యాటర్‌.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌-2023లో సత్తా చాటాడు.

ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగు అద్భుత అర్ధ శతకాల సాయంతో 354 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 

దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌, లెజెండరీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లిల తర్వాత ఈ జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్రియన్‌ లారా ఆనంద్‌బజార్‌ పత్రికతో మాట్లాడుతూ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే కాకుండా టెస్టుల్లోనూ గిల్‌ ఉన్నత శిఖరాలకు చేరుకోగలడని అంచనా వేశాడు.

‘‘నా పేరిట ఉన్న రెండు ప్రపంచ రికార్డులను శుబ్‌మన్‌ గిల్‌ తప్పక బద్దలు కొడతాడు. ప్రస్తుత తరంలో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్లలో గిల్‌ ముందు వరుసలో ఉంటాడు. భవిష్యత్తులో క్రికెట్‌ ప్రపంచాన్ని ఏలే సత్తా ఉన్నవాడు.

నా మాటలు గుర్తుపెట్టుకోండి.. రాసిపెట్టుకోండి అతడు నా రికార్డులను బ్రేక్‌ చేస్తాడు. గిల్‌ ఒకవేళ కౌంటీ క్రికెట్‌ ఆడితే నా 501 నాటౌట్‌ రికార్డును.. అదే విధంగా టెస్టుల్లో నా అత్యధిక స్కోరు 400 పరుగులను అతడు దాటేస్తాడు.

వరల్డ్‌కప్‌-2023లో గిల్‌ సెంచరీ చేయకపోవచ్చు. కానీ అంతకంటే మెరుగైన ఇన్నింగ్స్‌ ఇప్పటికే ఆడేశాడు. ప్రతి ఫార్మాట్లోనూ అతడు సెంచరీ సాధించాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ కూడా చేశాడు. ఐపీఎల్‌లోనూ ఒంటిచేత్తో ఎన్నోసార్లు తన జట్టును గెలిపించాడు.

భవిష్యత్తులో గిల్‌ కచ్చితంగా వీలైనన్ని ఎక్కువ ఐసీసీ టోర్నమెంట్లు గెలుస్తాడు’’ అని లారా 24 ఏళ్ల శుబ్‌మన్‌ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా సౌతాఫ్రికా టూర్‌లో భాగంగా గిల్‌ టీ20, టెస్టు సిరీస్‌ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. 

చదవండి: Ind vs SA: సౌతాఫ్రికాపై గెలవడం అంత సులువేం కాదు.. అక్కడ నెగ్గాలంటే: ద్రవిడ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top