
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ప్రశంసలు కురిపించాడు. ఈ ముంబైకర్ ఇప్పటికైనా తనలోని నైపుణ్యాలను గుర్తించాడని.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో అతడు బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని కొనియాడాడు.
అయితే, న్యూజిలాండ్(India vs New Zealand)తో ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ అవుటైన తీరు మాత్రం తనకు నచ్చలేదంటూ దిలీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. కేఎల్ రాహుల్(KL Rahul) ఆట తీరును సైతం ఈ మాజీ బ్యాటర్ ప్రశంసించాడు. అంతేకాదు.. ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్న సెలక్టర్ల నిర్ణయం సరైందని నిరూపితమైందంటూ మేనేజ్‌మెంట్ వ్యూహాలను మెచ్చుకున్నాడు.
కాగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న ముగిసిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది.
న్యూజిలాండ్‌పై గెలుపొంది ట్రోఫీని ముద్దాడి
ఈ నేపథ్యంలో గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లను చిత్తు చేసిన రోహిత్ సేన.. ఆఖరిగా న్యూజిలాండ్‌పై జయకేతనం ఎగురువేసింది. ఈ క్రమంలో గ్రూప్-ఎ టాపర్‌గా సెమీస్ చేరి.. అక్కడ ఆస్ట్రేలియాను ఓడించింది.
ఈ క్రమంలో ఫైనల్లోనూ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ అజేయంగా నిలిచి చాంపియన్‌గా అవతరించింది. ఈ విజయాల్లో మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి అతడు 243 పరుగులు చేసి.. భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. తనకు అచ్చొచ్చిన ఐదో స్థానంలో కాకుండా ఆరో స్థానంలో ఆడాల్సి వచ్చింది. అక్షర్ పటేల్ కోసం తన నంబర్‌ను త్యాగం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 140 పరుగులు చేసిన ఈ కర్ణాటక ఆటగాడు.. ముఖ్యంగా ఆసీస్‌తో సెమీస్‌లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
అయ్యర్ అద్భుతం
ఈ నేపథ్యంలో దిలీప్ వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ అద్భుతంగా ఆడాడు. కానీ ఫైనల్లో అతడు అవుటైన విధానం నాకు అసంతృప్తిని మిగిల్చింది. తను ఆఖరి వరకు అజేయంగా నిలిచి విజయంతో ముగించి ఉంటే బాగుండేది. ఏదేమైనా ఇప్పటికైనా అతడు తన నైపుణ్యాలను గుర్తించి.. అందుకు న్యాయం చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.
ఇక కేఎల్ రాహుల్ గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘‘ఆరో నంబర్‌లో వచ్చి కూడా కొన్ని ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయినా.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసమని అక్షర్ పటేల్‌ను రాహుల్ స్థానమైన ఐదో నంబర్‌లో పంపడం నాకేమీ నచ్చలేదు’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ తెలిపాడు.
సెలక్టర్లకు క్రెడిట్ ఇవ్వాలి
అదే విధంగా.. ‘‘టీమిండియా విజయంలో సెలక్టర్లకు తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి. ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ శర్మ వైఫల్యం తర్వాత కూడా అతడిని కెప్టెన్‌గా కొనసాగించారు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీలో ఐదుగురు స్పిన్నర్లను ఆడించాలన్న వారి నిర్ణయం కూడా సరైందని నిరూపితమైంది’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ బీసీసీఐ సెలక్షన్ కమిటీని ప్రశంసించాడు.
కాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరిలో సుందర్ ఒక్కడే పూర్తిస్థాయిలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌తో ఫైనల్లో మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా షాట్‌కు యత్నించి రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
చదవండి: అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment