
2023 ఏడాదిలో టీమిండియా టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించిన టీమిండియా.. ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు. అయితే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్లో మాత్రం ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. అదే విధంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసింది.
అయినప్పటికీ సిరీస్‌ను కాపాడుకునే అవకాశం టీమిండియాకు ఉంది. కేప్‌టౌన్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధిస్తే.. సిరీస్ 1-1తో సమవుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. మరో రెండు రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనున్న నేపథ్యంలో ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023ను ప్రకటించాడు.
భోగ్లే ఎంపిక చేసిన జట్టులో టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లే చోటు దక్కించుకున్నారు. ఓపెనర్లుగా ఆసీస్ స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖావాజా, ఇంగ్లండ్ ఆటగాడు జాక్ క్రాలీకి చోటు దక్కింది. మూడు, నాలుగు స్ధానాల్లో వరుసగా న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్, జోరూట్ అవకాశం కల్పించాడు.
ఐదో స్ధానంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు ప్లేస్ ఇచ్చాడు. వికెట్ కీపర్‌గా ఆశ్యర్యకరంగా న్యూజిలాండ్ ఆటగాడు టామ్ బ్లాండల్‌ను బోగ్లే ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ల కోటాలో టీమిండియా వెటరన్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవి అశ్విన్‌కు ఛాన్స్ లభించింది.
ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఆసీస్ స్పీడ్ స్టార్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు. అయితే ఈ జట్టులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మకి చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ ఏడాది టెస్టుల్లో విరాట్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది 8 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 55.91 సగటుతో 671 పరుగులు చేశాడు.
ఇందులో 2 శతకాలతో పాటు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. రోహిత్ శర్మ 8 మ్యాచ్‌ల్లో41.92 సగటుతో 545 రన్స్ చేశాడు. ఇందులో రెండు శతకాలతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: Ranji Trophy 2024: రంజీ ట్రోఫీకి జట్టు ప్రకటన.. మహ్మద్ షమీ తమ్ముడు ఎంట్రీ?