25 నుంచి ఆర్చరీ శిబిరం 

National Archery Camp To Resume On August 25 - Sakshi

న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత భారత ఆర్చరీ క్రీడాకారులు మళ్లీ లక్ష్యాలపై గురి పెట్టనున్నారు. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 25 నుంచి జాతీయ ఆర్చరీ శిక్షణ శిబిరం పునఃప్రారంభం కానుంది. పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిబిరాన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.  16 మంది ఆర్చర్ల బృందం (ఎనిమిది మంది చొప్పున పురుషులు, మహిళలు) రికర్వ్‌ విభాగంలో తమ శిక్షణను కొనసాగించనున్నారు. వీరితో పాటు నలుగురు కోచ్‌లు, ఇద్దరు సహాయక సిబ్బంది ఈ క్యాంపులో పాల్గొంటారని ‘సాయ్‌’ తెలిపింది.

ఈ క్యాంపునకు ఎంపికైన వారందరూ ఈ నెల 25న ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్‌ చేయాల్సిందిగా ‘సాయ్‌’ ఆదేశించింది. అనంతరం వీరికి కరోనా పరీక్షలు నిర్వహించి... 14 రోజుల పాటు క్వారంటైన్‌ చేయనుంది. పురుషుల జట్టు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా... మహిళల జట్టు మాత్రం ఆ పనిలో నిమగ్నమైంది. అంతే కాకుండా వ్యక్తిగత విభాగాల్లో సైతం ఒలింపిక్‌ బెర్తుల కోసం భారత ఆర్చర్లు పోటీ పడాల్సి ఉంది. వచ్చే ఏడాది పారిస్‌ వేదికగా జరిగే ఒలింపిక్‌ అర్హత టోర్నీలో భారత జట్టు పోటీ పడనుంది. 

శిబిరానికి ఎంపికైన పురుషుల జట్టు: తరుణ్‌దీప్‌ రాయ్, అతాను దాస్, బి.ధీరజ్, ప్రవీణ్‌ జాదవ్, జయంత తలుక్దార్, సుఖ్‌మను బాబ్రేకర్, కపిల్, విశ్వాస్‌; మహిళల జట్టు: దీపిక కుమారి, అంకిత భగత్, బొంబేలా దేవి, రిధీ, మధు వేద్వాన్, హిమని, ప్రమీలా బరియా, తిషా సంచెటి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top