నమీబియా జట్టు (PC: ICC)
నమీబియా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఫుల్ మెంబర్ జట్టుపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచింది. ఐర్లాండ్‌పై ఐదో వన్డేలో విజయం సాధించి ఈ ఫీట్ అందుకుంది.
కాగా ఐదు వన్డేలు ఆడేందుకు ఐర్లాండ్ జట్టు నమీబియా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో తొలి వన్డేలో పసికూన నమీబియాను 55 పరుగుల తేడాతో ఓడించిన ఐరిష్ జట్టు.. రెండో వన్డేలో మాత్రం 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అనంతరం మూడో వన్డేలో నమీబియా 63 పరుగుల తేడాతో గెలవగా.. నాలుగో వన్డేలో ఐర్లాండ్ ఏకంగా 130 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. ఈ క్రమంలో సిరీస్ 2-2తో సమం కాగా.. ఆదివారం నాటి చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో నమీబియా అదరగొట్టింది.
చెలరేగిన నమీబియా బౌలర్లు
విండ్‌హాక్ వేదికగా సాగిన ఈ సిరీస్‌లో ఐదో వన్డేలో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. నమీబియా బౌలర్లు పర్యాటక జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 33.1 ఓవర్లలో కేవలం 129 పరుగులు మాత్రమే చేసి ఐర్లాండ్ ఆలౌట్ అయింది.
జోర్డాన్ నీల్ 33 పరుగులతో ఐర్లాండ్ టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. కేడ్ కార్‌మైకేల్ 27, హ్యారీ టెక్టార్ 21, కెప్టెన్ లోర్కాన్ 20 పరుగులు చేయగలిగారు. నమీబియా బౌలర్లలో జేజే స్మిత్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. జాక్ బ్రేసెల్ మూడు, రూబెన్ ట్రంపెల్‌మ్యాన్, మాక్స్ హీంగో, విలియం మైబర్గ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
తొలిసారి వన్డే సిరీస్ కైవసం
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా కేవలం 21.2 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 131 పరుగులు స్కోరు చేసి పని పూర్తిచేసింది. లారెన్ స్టీంకాంప్ 46, కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ 30 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఐదో వన్డేలో విజయంతో నమీబియా ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. తద్వారా టెస్టు హోదా ఉన్న జట్టుపై తొలిసారి ఈ ఘనత సాధించిన జట్టుగా నిలిచింది.
ఇవీ చదవండి:ఐదేసిన ముకేశ్.. సిరాజ్‌కు నాలుగు వికెట్లు; కివీస్ 424 ఆలౌట్
నేనూ మనిషినే.. ఒక్కోసారి మానసికంగా అలసిపోతాను.. కానీ: గంభీర్


