తుదిజట్టులో లేకున్నా.. జహీర్‌ ఖాన్‌ వల్లే ఇలా! | My mindset is always about You should come to dominate: Akash Singh | Sakshi
Sakshi News home page

తుదిజట్టులో లేకున్నా.. జహీర్‌ ఖాన్‌ వల్లే ఇలా!

May 17 2026 8:57 AM | Updated on May 17 2026 9:00 AM

My mindset is always about You should come to dominate: Akash Singh

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేస్‌ బౌలర్‌ ఆకాశ్‌ సింగ్‌ వికెట్‌ పడగొట్టినప్పుడల్లా జేబులోంచి ఒక కాగితాన్ని బయటకు తీసి చేసుకున్న సంబరం అందరినీ ఆకర్షించింది. 

అక్కీ ఆన్‌ ఫైర్‌
చెన్నై ఇన్నింగ్స్‌లో టాప్‌–3 బ్యాటర్లు సంజూ సామ్సన్, రుతురాజ్‌ గైక్వాడ్, ఉర్విల్‌ పటేల్‌లను అవుట్‌ చేసినప్పుడు అతను తన ఆనందాన్ని ప్రదర్శించాడు. దానిపై ఇంగ్లిష్‌లో.. ‘అక్కీ ఆన్‌ ఫైర్‌–టీ20ల్లో వికెట్లు ఎలా తీయాలో ఆకాశ్‌కు తెలుసు’ అనే వాక్యాలు రాసి ఉన్నాయి.

అది కాగితం మాత్రమే కాదు 
కెరీర్‌ ఆరంభ దశలోనే ఉన్న 24 ఏళ్ల ఆకాశ్‌ ఇలా చేయడంపై కొన్ని విమర్శలు వచ్చినా... వాటికి అతను వివరణ ఇచ్చాడు. అది కాగితం మాత్రమే కాదని, తనలో స్ఫూర్తి నింపే మాటలని స్పష్టం చేశాడు. ఆ చీటీని తాను ఈ మ్యాచ్‌ కోసమే తీసుకు రాలేదని, ఇలాంటివి రాసుకొని ప్రేరణ పొందడం తనకు మొదటి నుంచి అలవాటు ఉందని ఆకాశ్‌ అన్నాడు.

‘వేర్వేరు వ్యక్తులు వేర్వేరు అంశాల నుంచి స్ఫూర్తి పొందుతారు. నేను అలాంటి కాగితాన్ని ఎప్పుడూ బయటకు తీసి చూపించకపోవచ్చు. కానీ నా మనసులో వాటి గురించి ఆలోచన ఉంటుంది. ఏదైనా ప్రేరణనిచ్చే విషయం రాసిన చీటీ జేబులో ఉంటే అది మీ ప్రదర్శనను గుర్తు చేస్తూ ఉంటుంది. ఏదైనా అనుకొని వచ్చి నిజంగా దానిని చేసి చూపించగలగడం ముఖ్యం.

అలాంటి రాతలు ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా ఆలోచన వస్తే దానిని వెంటనే రాసుకుంటాను. మ్యాచ్‌కు ముందు రోజు వచ్చిన ఆలోచననే కాగితంపై పెట్టి తీసుకొచ్చాను. నేను ఈ మ్యాచ్‌ ఆడబోతున్నానని రెండు రోజుల ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో తెలిసింది’ అని ఆకాశ్‌ వ్యాఖ్యానించాడు.

తుదిజట్టులో లేకున్నా.. జహీర్‌ ఖాన్‌ వల్లే ఇలా!
కాగా 2025 సీజన్‌లో కూడా లక్నో జట్టులో ఉన్న ఆకాశ్‌ 3 మ్యాచ్‌లు ఆడి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు సీజన్లుగా లక్నో ఫ్రాంచైజీ తనను ప్రోత్సహిస్తూ అండగా నిలిచిందని, దాని వల్లే తన ఆట మరింత మెరుగైందని అతను పేర్కొన్నాడు. ‘నేను తుది జట్టులో లేని సమయంలో కూడా కోచ్‌లు నాకు సరైన మార్గనిర్దేశనం చేశారు. 

గత ఏడాది జహీర్‌ ఖాన్, ఈసారి భరత్‌ అరుణ్‌ నన్ను నడిపించారు. ఎప్పుడు అవకాశం లభించినా సత్తా చాటేలా నన్ను సిద్ధం చేశారు. కెపె్టన్‌ పంత్‌ కూడా మద్దతునివ్వడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది.

కొత్త బంతితో నేను మెరుగ్గా బౌలింగ్‌ చేయగలనని గుర్తింపు అవకాశం కల్పించారు. పిచ్‌పై మంచి బౌన్స్‌ కూడా ఉండటంతో చెన్నైపై మూడు వికెట్లు తీయగలిగాను’ అని ఆకాశ్‌ వివరించాడు.

అండర్‌–19 స్థాయి నుంచి వచ్చి...
ఆకాశ్‌ స్వస్థలం రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌. జైపూర్‌ శివార్లలోని హథోడ్‌లో ఉన్న ఆరావళి క్రికెట్‌ క్లబ్‌లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం ఆకాశ్‌తో పాటు ఐపీఎల్‌లో ఆడుతున్న అశోక్‌ శర్మ (గుజరాత్‌), ముకుల్‌ చౌదరి (లక్నో), కార్తీక్‌ శర్మ (చెన్నై) కూడా అక్కడి నుంచి వచ్చినవారే.

ఇక 2019లో రాజస్తాన్‌ జట్టు తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన ఆకాశ్‌ రెండేళ్ల తర్వాత అదే టీమ్‌ తరఫున వన్డేలు కూడా ఆడాడు. అయితే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అవకాశం రాకపోవడంతో నాగాలాండ్‌ జట్టుకు మారిన ఆకాశ్‌ 2022లో రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టాడు. 

గత సీజన్‌లో అతను మళ్లీ రాజస్తాన్‌కు తిరిగొచ్చి రంజీ మ్యాచ్‌లు ఆడాడు. 2020 అండర్‌–19 ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడైన ఆకాశ్‌... ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లతో జరిగిన గొడవలో భాగంగా ఉండటంతో ఐసీసీ శిక్షకు కూడా గురయ్యాడు.

పడుతూ లేస్తూ
పోటీ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన ఇన్నేళ్లయినా...ఆకాశ్‌ ఐపీఎల్‌ ప్రయాణం మాత్రం పడుతూ లేస్తూ సాగుతోంది. 2021లో తొలిసారి రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అతను ఒక్క మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు! 

తర్వాతి సీజన్‌లో అవకాశం రాకపోగా... 2023లో ముకేశ్‌ చౌదరీ గాయపడటంతో అతని స్థానంలో ఆకాశ్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తీసుకుంది. ఆరు మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసిన అతను టైటిల్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా నిలవడం విశేషం. ఇక​ 2024లో మళ్లీ ఐపీఎల్‌ చాన్స్‌ దక్కలేదు కానీ గత సీజన్‌నుంచి లక్నో టీమ్‌తో ఉన్నాడు.  

చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన కేకేఆర్‌ ఓపెనర్‌

Advertisement
 
Advertisement
Advertisement