వచ్చే ఏడాది కూడా ధోనీ సారథ్యంలోనే!

MS Dhoni Will Lead CSK For Next Season 2021 CEO Says - Sakshi

చెన్నైసూపర్‌ కింగ్స్‌ జట్టు సీఈఓ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్‌ సీజన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అస్సలు కలిసిరాలేదు. టోర్నీ ఆరంభానికి ముందే ఆటగాళ్లు కరోనా బారిన పడటం కలకలం సృష్టించగా, సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఆదిలోనే జట్టుకు దూరమయ్యారు. వరుస ఓటములు ధోని సేనను వెంటాడాయి. పేలవ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టు ముందు చెన్నై టీం చేతులెత్తేసింది. దీంతో ఐపీఎల్‌- 2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా సీఎస్‌కే నిలిచింది. మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా, దాదాపు ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన సూపర్‌కింగ్స్‌ లీగ్‌ దశలోనే వెనుదిరగడం టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి.

దీంతో కెప్టెన్‌ ధోని, జట్టు ఆటతీరుపై సీఎస్‌కే ఫ్యాన్స్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సోషల్‌ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ధోని ఇక కెప్టెన్సీ నుంచి తప్పుకొంటే మంచిదని, జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ మరికొంతమంది తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. ముంబై ఆటగాళ్లు హార్లిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యాలతో సహా రాజస్తాన్‌ జట్టు ప్లేయర్‌ జోస్‌ బట్లర్‌కు ధోని తన జెర్సీని బహూకరించిన నేపథ్యంలో, కెప్టెన్‌ కూల్‌ త్వరలోనే ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పబోతున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. దీంతో ధోని అభిమానులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. (చదవండి: సీఎస్‌కే ఔట్‌; ఇది కేవలం ఆట మాత్రమే: సాక్షి)


ఇలాంటి తరుణంలో సీఎస్‌కే జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్‌ ధోని ఫ్యాన్స్‌కు శుభవార్త అందించారు. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో కూడా ధోనియే, చెన్నై టీంకు సారథ్యం వహిస్తారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘2021లో కూడా ధోనినే జట్టును ముందుండి నడిపిస్తారు. అవును, కచ్చితంగా ఇదే జరుగుతుంది. ఐపీఎల్‌ టోర్నీలో అతడు, మాకు 3 సార్లు టైటిళ్లు అందించాడు. జట్టు కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరకుండా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఇలాంటి ఒక చేదు అనుభవం కారణంగా ప్రతీ విషయంలోనూ మార్పులు చేయాల్సిన పనిలేదు. అయితే ఒక మాట వాస్తవం. (చదవండి: 100 లోపే అనుకున్నాం, కానీ అతని వల్లే)

ఈసారి మా స్థాయికి తగ్గట్టు అస్సలు ఆడలేకపోయాం. గెలిచే మ్యాచ్‌లను కూడా చేజార్చుకున్నాం. సురేశ్‌ రైనా, హర్భజన్‌ లేకపోవడం, కోవిడ్‌ కేసులు వెంటాడటం తీవ్ర ప్రభావం చూపాయి’’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాత్రం జట్టు ఆటతీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘త్రీ ఇయర్‌ సైకిల్‌ను పరిశీలించినట్లయితే, తొలి ఏడాది మేం టైటిల్‌ గెలిచాం. ఆ తర్వాతి సంవత్సరంలో చివరి బంతి వరకు పోరాడి ఓటమి పాలయ్యాం.

ఇప్పుడు ఈ ఏజింగ్‌ స్క్వాడ్‌కు, మాకు దుబాయ్‌ ఓ ఛాలెంజ్‌ విసిరింది. మా రిక్వైర్‌మెంట్స్‌ మార్చుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ధోని తనకు తాను తప్పుకొంటే తప్ప, ఇప్పటికిప్పుడు అతడి స్థానానికి వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా, ఇతర సీనియర్‌ ఆటగాళ్లపై మాత్రం కచ్చితంగా వేటుపడే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top