Virat Kohli: కోహ్లి విషయంలో బీసీసీఐ వైఖరిపై ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు

Money Factor Behind BCCI Decision To Not Drop Virat Kohli Says Monty Panesar - Sakshi

క్రికెట్‌ సర్కిల్స్‌లో ప్రస్తుతం ఏ ఇద్దరు ముగ్గరు కలిసినా టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌ విషయమే చర్చకు వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి సెంచరీ చేసి దాదాపు 1000 రోజులు కావస్తుండటంతో అభిమానులు, విశ్లేషకులు, మాజీలు తమ తమ అభిప్రాయాలను రకరకాల వేదికలపై షేర్‌ చేస్తున్నారు. కొందరు గణాంకాలు చూపుతూ కోహ్లికి అనుకూలంగా మాట్లడుతుంటే.. మరికొందరు రన్‌ మెషీన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. 

తాజాగా కోహ్లి పేలవ ఫామ్‌తో టీమిండియాలో కొనసాగడంపై ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ మాంటీ పనేసర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి వరుసగా విఫలమవుతున్నా బీసీసీఐ అతనికి వరుస అవకాశాలు కల్పిస్తున్న విషయంలో కొత్త కోణాన్ని బయటపెట్టాడు. విశ్వవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ కలిగిన కోహ్లిపై వేటు వేస్తే స్పాన్సర్ల రూపంలో బీసీసీఐ భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే బీసీసీఐ కోహ్లిపై వేటు వేసే సాహసం చేయలేకపోతుందని వివాదాస్పద ఆరోపణలు చేశాడు. 

డబ్బు కోసమే బీసీసీఐ ఇదంతా చేస్తుందని, దీని వల్ల టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా విజయావకాశాలు దెబ్బ తింటాయని అన్నాడు. కోహ్లి బీసీసీఐతో పాటు పలు బడా కంపెనీలకు ఆదాయ వనరుగా ఉన్నాడని, కోహ్లిని టీమిండియా నుంచి తప్పిస్తే సదరు కెంపెనీలు దివాలా తీస్తాయని, అందుకే బీసీసీఐ కోహ్లి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందని తెలిపాడు. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్‌ ఈ మేరకు తన అభిప్రాయాలను వెల్లడించాడు.  
చదవండి: సెంచరీ కోసం కోహ్లి కూడా ఇంతలా తపించి ఉండడు..
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top