కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీ తనను వదిలించుకోవడంతో ఐపీఎల్ మొత్తానికే గుడ్బై చెప్పేశాడు. తదుపరి సీజన్ వేలంలోనూ తన పేరు కూడా నమోదు చేసుకోలేదు.
కేకేఆర్ వద్దనుకోవడంతో మనస్థాపం చెందినట్లున్న మొయిన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈమేరకు తన ఇన్స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. పీఎస్ఎల్ 2026కి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.
మొయిన్ ఐదేళ్ల తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడనున్నాడు. 2020లో చివరిగా అతను ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంచైజీకి ఆడాడు.
కాగా, ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ మొయిన్‌తో పాటు చాలామంది స్టార్ ఆటగాళ్లను వదిలేసింది. ఆ ఫ్రాంచైజీ విడుదల చేసిన ఆటగాళ్లలో టీ20 దిగ్గజం ఆండ్రీ రసెల్ కూడా ఉన్నాడు.
రసెల్తో పాటు గత సీజన్ వేలంలో రూ. 23.75 కోట్ల రికార్డు ధర దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్‌ను సైతం కేకేఆర్ వదిలేసింది. వీరితో పాటు టీ20 స్పెషలిస్ట్లు అయిన డికాక్, స్పెన్సర్ జాన్సన్, నోర్జే, రహ్మానుల్లా గుర్బాజ్ను కూడా వేలానికి వదిలేసింది.
దిగ్గజాన్నే వదిలేసింది, మొయిన్ ఎంత..?
మొయిన్ను కేకేఆర్ వదిలేయడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. వయసు పైబడటంతో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. గత సీజన్లో అతను లభించిన అడపాదడపా అవకాశాలను పెద్దగా సద్వినయోగం చేసుకోలేకపోయాడు. రసెల్ లాంటి దిగ్గజాన్నే సైతం వదులుకున్న కేకేఆర్కు మొయిన్ను సాగనంపడం పెద్ద సమస్యేమీ కాలేదు.


