#Maidaan: రియల్‌ హీరో రహీం సాబ్‌.. స్కూల్‌ టీచర్‌ నుంచి కోచ్‌ దాకా! | Sakshi
Sakshi News home page

#Maidaan: రియల్‌ హీరో రహీం సాబ్‌.. స్కూల్‌ టీచర్‌ నుంచి కోచ్‌ దాకా!

Published Sat, Apr 13 2024 4:36 PM

Maidaan: Who Was Abdul Rahim? From School Teacher To Coach, Made Indian Team 'Brazil of Asia' - Sakshi

స్పోర్ట్స్‌ డ్రామాతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశపరచవని ‘మైదాన్‌’ ద్వారా మరోసారి నిరూపితమైంది. అజయ్‌ దేవ్‌గణ్‌, ప్రియమణి ప్రధాన పాత్రల్లో అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ రూపొందించిన ఈ చిత్రానికి మూలం సయ్యద్‌ అబ్దుల్‌ రహీం కథ.

భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు ఆయనది. ఇంతకీ ఎవరాయన? ఆయన స్వస్థలం ఎక్కడ? భారత ఫుట్‌బాల్‌కు ఆయన అందించిన సేవలు ఏమిటి?..

సయ్యద్‌ అబ్దుల్‌ రహీం హైదరాబాద్‌ రాష్ట్రంలో 1909లో జన్మించారు. ఫుట్‌బాల్‌పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకున్న ఆయన.. ఉపాధ్యాయుడిగా కెరీర్‌ ఆరంభించారు. ఆ తర్వాత ఆటకే పూర్తి సమయం కేటాయించారు.

ముప్పై ఏళ్ల వయసులో కమార్‌ క్లబ్‌, యూరోపియన్‌ క్లబ్‌ తరఫున క్రీడాకారుడిగా రాణించారు. ఇక 1950లో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ క్లబ్‌కోచ్‌గా మారారు. రహీం సాబ్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన మార్గదర్శనంలో హైదరాబాద్‌ క్లబ్‌ మూడు డ్యూరాండ్‌, ఐదు రోవర్స్‌ కప్‌లు గెలిచింది.

ఈ క్రమంలో భారత జట్టు కోచ్‌గా రహీం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పుష్కరకాలం పాటు జట్టును అత్యుత్తమ స్థాయిలో నిలిపారు. రహీం సాబ్‌ శిక్షణలో రాటు దేలిన టీమిండయా ప్రతిష్టాత్మక టోర్నీలో విజయాలు సాధించింది.

స్వర్ణ యుగం
1951 ఆసియా క్రీడల ఫైనల్లో ఇరాన్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకుని గోల్డెన్‌ రన్‌ మొదలుపెట్టింది. ఇక 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌ చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. అనూహ్య రీతిలో నాలుగో స్థానంలో నిలిచింది. 

ఇదంతా రహీం సాబ్‌ చలవే అనడంలో సందేహం లేదు. ఇక 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లోనూ భారత జట్టుకు ఆయనే కోచ్‌గా వ్యవహరించారు. రహీం గైడెన్స్‌లోనే 1962 ఆసియా క్రీడల్లో భారత్‌ మరోసారి పసిడి పతకం సాధించింది. 

పీకే బెనర్జీ, చునీ గోస్వామి, పీటర్‌ తంగరాజ్‌ వంటి నైపుణ్యాలున్న ఆటగాళ్లను గుర్తించి వారిని మెరికల్లా తీర్చిదిద్దడంతో రహీం సాబ్‌ది కీలక పాత్ర. తన హయాంలో భారత ఫుట్‌బాల్‌ రూపురేఖలనే మార్చివేసిన రహీం.. ఇండియాను ‘బ్రెజిల్‌ ఆఫ్‌ ఆసియా’గా నీరాజనాలు అందుకునేలా చేశారు.

బ్రిటిష్‌ మూస పద్ధతిలో కాకుండా.. చిన్న చిన్న పాస్‌లతో కొత్త టెక్నిక్‌ను అనుసరించేలా చేసి సత్ఫలితాలు సాధించారు. నిజానికి ఇదే శైలితో బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ జట్టు 1958, 1962 వరల్డ్‌కప్‌ టైటిల్స్‌ గెలిచింది. 

తనదైన శైలిలో స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసి జట్టులో సరికొత్త ఉత్సాహాన్ని నింపిన రహీం సాబ్‌ ఉన్నంతకాలం భారత్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు ‘స్వర్ణ యుగం’లా సాగింది. అయితే, అనూహ్య పరిస్థితుల్లో కోచింగ్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న రహీం సాబ్‌.. 1963లో కాన్సర్‌ బారిన పడ్డారు. 

ఇండియా ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు
అదే ఏడాది జూన్‌లో తుదిశ్వాస విడిచారు. 53 ఏళ్ల వయసులోనే అర్ధంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో భారత్‌ ఫుట్‌బాల్‌ జట్టు విజయాలు సాధించిందే లేదు. దీనిని బట్టి చూస్తే.. ‘‘రహీమ్‌ సాబ్‌ తనతో పాటు ఇండియా ఫుట్‌బాల్‌ను కూడా సమాధిలోకి తీసుకుపోయారు’’ అంటూ సహచర ఆటగాడు ఆయనకు నివాళి అర్పిస్తూ అన్న మాటలు నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది.

గుర్తింపు దక్కని యోధుడు
భారత ఫుట్‌బాల్‌ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రహీం సాబ్‌కు మాత్రం వ్యక్తిగతంగా పెద్దగా మేలు చేకూర్చలేదు. ఆర్థికంగానూ ఆయన పొందిన ప్రయోజనాలు అంతంత మాత్రమే! 

ఎంతో మందిని మేటి ఫుట్‌బాలర్లుగా తీర్చిదిద్దిన ఈ గురువును ద్రోణాచార్య అవార్డుతోనైనా సత్కరించకపోయింది ప్రభుత్వం. ఇక రహీం సాబ్‌ కొడుకు సయ్యద్‌ షాహిద్‌ హకీం కూడా తండ్రి బాటలోనే నడిచారు.

ఫుట్‌బాల్‌పై ఇష్టం పెంచుకున్న హకీం 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నారు.  ఆ తర్వాత మళ్లీ ఇంకెప్పుడూ ఆయన ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. 

మైదాన్‌ సినిమాతో నేటి తరానికి తెలిసేలా
సయ్యద్‌ అబ్దుల్‌ రహీం కథను ప్రపంచానికి పరిచయం చేయడంలో నోవీ కపాడియాది కీలక పాత్ర. అయితే, రహీం సాబ్‌తో పాటు ఆయన కుమారుడు హకీం, నోవీ కూడా ఇప్పుడు మన మధ్య లేకపోవడం విషాదకరం. అయితే, రియల్‌ హీరో అయిన రహీం మాత్రం అజరామరంగా  అభిమానుల గుండెల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు.

Advertisement
 
Advertisement