
వెస్టిండీస్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ బౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా తేలిపోయారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 248 పరుగులకే కుప్పకూలింది.
కనీసం ఫాల్ ఆన్ కూడా కరేబియన్ జట్టు దాటలేకపోయింది. 140/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఛేజ్ సేన అదనంగా 108 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.
భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు విండీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. మూడో రోజు ఆట ఆరంభం నుంచే యాదవ్ బంతితో మాయ చేశాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా మూడు, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలా వికెట్ సాధించారు.
భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మరోసారి విండీస్ బ్యాటింగ్‌కు దిగనుంది. ఇన్నింగ్స్ తేడాతో భారత్ గెలిచేందుకు ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా టీమిండియాకు విండీస్ పోటీ ఇస్తుందో లేదో ఎదురు చూడాలి.
అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 518 పరుగుల భారీస్కోరు వద్ద క్లేర్ చేసింది. యశస్వి జైశ్వాల్ (177), శుభ్‌మన్ గిల్(129) భారీ శతకాలతో కదం తొక్కగా..నితీశ్ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జురేల్ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు), సాయిసుదర్శన్(87) రాణించారు.
చదవండి: మా బౌలర్లను మరి అంతలా కొట్టకు జైశ్వాల్: బ్రియన్ లారా