
మాజీ కోచ్ రవిశాస్త్రి
న్యూఢిల్లీ: నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకున్న భారత బ్యాటర్ కేఎల్ రాహుల్... ఇంగ్లండ్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. మరో మూడు నాలుగేళ్ల పాటు అతడు ఇదే జోరు కొనసాగించే అవకాశం ఉందని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘అండర్సన్–టెండూల్కర్’ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రాహుల్ 62.50 సగటుతో 375 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.
ప్రస్తుతం సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, జేమీ స్మిత్ తర్వాత నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ... ‘రాహుల్ తన బ్యాటింగ్ శైలిలో స్వల్ప మార్పులు చేసుకున్నాడు. బ్యాటింగ్ స్టాన్స్‌తో పాటు డిఫెన్స్ ఆడే తీరులో మరింత మెరుగయ్యాడు. దీంతో పరుగులు చేయడం అతడికి మరింత సులువవుతోంది. దీంతో పాటు బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గాయి. గతంలో ఇలా చాలా సార్లు అతడు అవుటయ్యేవాడు. నైపుణ్యం పరంగా రాహుల్ చాలా మెరుగ్గా ఉన్నాడు.
ఈ సిరీస్‌లో బంతి ఎక్కువ స్వింగ్ అయిన దాఖలాలు లేవు. ఒకవేళ అనుకోకుండా ఏదైన బంతి అనూహ్యంగా దూసుకొచి్చనా దాన్ని ఎదుర్కొనేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నాడు. ఇదే తీరు కొనసాగితే మరి కొన్నేళ్ల పాటు రాహుల్ అత్యున్నత స్థాయి ప్రదర్శన కొనసాగించగలడు. ఈ సిరీస్‌లో అతడి బెస్ట్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం రాహుల్ కెరీర్ అత్యుత్తమ దశలో ఉంది. ఇలాగే సాగితే మరెన్నో శతకాలు అతడి ఖాతాలో చేరతాయి.
మున్ముందు టీమిండియా స్వదేశంలో చాలా మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో కెరీర్ ముగించే సమయానికి అతడి టెస్టు సగటు 50కి చేరువవడం ఖాయం’ అని వివరించాడు. జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 61 టెస్టులు ఆడిన 33 ఏళ్ల రాహుల్ 35.26 సగటుతో 3632 పరుగులు చేశాడు. అందుటో 10 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి.