ఇంగ్లండ్‌కు బయల్దేరిన కేఎల్‌ రాహుల్‌ | KL Rahul Arrives In England To Join India A For 2nd Unofficial Test vs England Lions | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు బయల్దేరిన కేఎల్‌ రాహుల్‌

Jun 3 2025 7:01 PM | Updated on Jun 3 2025 7:14 PM

KL Rahul Arrives In England To Join India A For 2nd Unofficial Test vs England Lions

త్వరలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం​ టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టాడు. రాహుల్‌ నిన్ననే ముంబై నుంచి లండన్‌కు బయల్దేరాడు. రాహుల్‌ లండన్‌లోని హీథ్రూ విమానాశ్రయంలో ల్యాండైన దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

రాహుల్‌ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ లయన్స్‌తో నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడతాడు. ఈ మ్యాచ్‌ కోసమే రాహుల్‌ చాలా ముందుగా లండన్‌లో ల్యాండయ్యాడు. ఈ మ్యాచ్‌ జూన్‌ 6న ప్రారంభం కానుంది. నార్తంప్టన్‌ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం తనను ముందుగానే ఇంగ్లండ్‌కు పంపాలని రాహుల్‌ బీసీసీఐకి ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. భారత్‌లో వాతావరణం ప్రాక్టీస్‌కు అనువుగా లేదని, అందుకే తనకు లయన్స్‌తో మ్యాచ్‌ ఆడే అవకాశం ఇవ్వాలని రాహుల్‌ బీసీసీఐని కోరాడు. రాహుల్‌ కోరిక మేరకు బీసీసీఐ అతన్ని ముందుగానే లండన్‌కు పంపింది.

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు భారత్‌-ఏ జట్టు ఇంగ్లండ్‌ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ నిన్ననే ముగిసింది. ఈ మ్యాచ్‌ డ్రా అయ్యింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లకు మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించింది. ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపికైన కరుణ్‌ నాయర్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌, ధృవ్‌ జురెల్‌ తృటిలో సెంచరీలు మిస్‌ అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌, కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌, ధృవ్‌ జురెల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి అర్ద సెంచరీలతో రాణించారు.

లయన్స్‌తో రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ తర్వాత భారత జట్టు ఓ ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌ జూన్‌ 13 నుంచి 16 వరకు జరుగుతుంది. అనంతరం జూన్‌ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌ కోసం శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని భారత జట్టు జూన్‌ 5వ తేదీ తర్వాత లండన్‌కు బయల్దేరుతుంది. రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ఈ సిరీస్‌కు ముందే గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌కు ముందే స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, కరుణ్‌ నాయర్‌, అభిమన్యు ఈశ్వరన్‌, యశస్వి జైస్వాల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రిషబ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, ధృవ్‌ జురెల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌దీప్‌, అర్షదీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ షెడ్యూల్‌..
జూన్‌ 20-24- తొలి టెస్ట్‌ (లీడ్స్‌)
జులై 2-6- రెండో టెస్ట్‌ (బర్మింగ్హమ్‌)
జులై 10-14- మూడో టెస్ట్‌ (లార్డ్స్‌)
జులై 23-27- నాలుగో టెస్ట్‌ (మాంచెస్టర్‌)
జులై 31-ఆగస్ట్‌ 4- ఐదో టెస్ట్‌ (కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌) 
 

Advertisement
 
Advertisement
Advertisement