రాజస్తాన్‌ లక్ష్యం 175 పరుగులు

KKR Set 175 Runs Target To Rajasthan Royals IPL 2020 - Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ ఎక్కువగా మెరుపులు లేకుండానే కొనసాగింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి  కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.ఓపెనర్‌ గిల్‌ మరోసారి సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. చివర్లో మోర్గాన్‌ మెరుపులతో కేకేఆర్‌ 170 పరుగుల మార్కును దాటింది. కాగా 34 బంతుల్లో 47 పరుగులు చేసిన గిల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. హాఫ్‌ సెంచరీకి చేరువైన గిల్‌ను జోఫ్రా ఆర్చర్‌ బోల్తా కొట్టించాడు. రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్‌ నరైన్‌ మాత్రం మరోసారి పూర్తిగా విఫలమయ్యాడు. ఆరంభం నుంచి పెద్దగా మెరుపులు లేకుండా సాగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 36 పరుగులకు చేరుకోగానే ఉనాద్కట్‌ బౌలింగ్‌లో సునీల్‌ నరైన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్‌ రాణాతో కలిసి గిల్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. (చదవండి : హాఫ్‌ సెంచరీ ముంగిట గిల్‌ ఔట్‌!)

పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు ఒక వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. పవర్‌ప్లే ముగిసిన తర్వాత గిల్‌, రాణాలు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తెవాటియా వేసిన 10 ఓవర్‌లో చివరి బంతికి భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన నితీష్‌ రాణా క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రసెల్‌ 3 సిక్సర్లు కొట్టి 14 బంతుల్లో 22 పరుగులు చేసినా దానిని బారీ స్కోరుగా మలచలేకపోయాడు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ దినేష్‌ కార్తీక్‌ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌గా వెనుదిరిగాడు. అయితే చివర్లో ఇయాన్‌ మోర్గాన్‌ 23బంతుల్లో 34* పరుగులతో(  ఫోర్‌, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇక రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌ 2 వికెట్లు తీయగా, అంకిత్‌ రాజ్‌పుత్‌, టామ్‌ కరన్‌, ఉనాద్కట్‌, తెవాటియాలు ఒక్కో వికెట్‌ తీశారు. (చదవండి : ఐపీఎల్‌ తర్వాత ధోని చేసేదేంటో తెలుసా?)

ఇక ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు ఐపీఎల్‌లో 21 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో రాజస్తాన్‌ 10, కేకేఆర్‌ 10 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. రాజస్తాన్‌పై కేకేఆర్‌ అత్యధిక స్కోరు 190, అత్యల్ప స్కోరు 125గా ఉంది. కాగా కేకేఆర్‌పై రాజస్తాన్‌ అత్యధిక స్కోరు 199 పరుగులు, అత్యల్ప స్కోరు 81గా ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో కోల్‌కతా 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్తాన్‌ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top