
తొలిరోజు కాస్పరోవ్‌దే పైచేయి
క్లచ్ చెస్ లెజెండ్స్
సెయింట్ లూయిస్ (అమెరికా): జగద్విఖ్యాత చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్‌ల మధ్య జరుగుతున్న క్లచ్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌కు తొలిరోజు కలిసిరాలేదు. దీంతో రష్యన్ గ్రాండ్‌మాస్టర్ కాస్పరోవ్ పైచేయి సాధించాడు. గురువారం జరిగిన నాలుగు గేమ్‌ల ఫలితాల అనంతరం కాస్పరోవ్ 2.5–1.5తో ఆనంద్‌పై ఆధిక్యంలో ఉన్నాడు.
తద్వారా రిటైర్ అయిన 21 ఏళ్ల తర్వాత బరిలోకి దిగిన 62 ఏళ్ల రష్యన్ దిగ్గజం తనలో గెలిచేసత్తా ఏమాత్రం తగ్గలేదని తన ‘ఎత్తులు–పైఎత్తుల’తో చాటాడు. ముందుగా జరిగిన రెండు గేమ్‌లు కూడా డ్రాగానే ముగిశాయి. దీంతో ఇద్దరు 1–1తో సమవుజ్జీలుగా నిలిచారు. మూడో గేమ్‌లో కాస్పరోవ్ విజయం సాధించడంతో 2–1తో పైచేయి సాధించాడు. తర్వాత జరిగిన నాలుగో రౌండ్ గేమ్ డ్రాగా ముగియడంతో ఇద్దరికి చెరో అర పాయింట్ లభించింది.
ఈ టోర్నీలో రెండో రోజు కూడా నాలుగు గేమ్‌లు జరుగుతాయి. రెండు ర్యాపిడ్, రెండు బ్లిట్జ్ గేమ్‌లు కాగా... రెండో రోజు విజయం సాధిస్తే 2 పాయింట్లు, మూడో రోజు విజయానికి 3 పాయింట్లు లభిస్తాయి. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో జరిగే పోటీలు మరింత ఆసక్తికరంగా జరగనున్నాయి.