టోర్నీ మధ్యలో వైదొలిగిన టీమిండియా ప్లేయర్‌ | Kashvee Gautam Ruled Out Of Women's Tri Series Due To Injury | Sakshi
Sakshi News home page

టోర్నీ మధ్యలో వైదొలిగిన టీమిండియా ప్లేయర్‌

May 6 2025 7:58 PM | Updated on May 6 2025 8:14 PM

Kashvee Gautam Ruled Out Of Women's Tri Series Due To Injury

భారత మహిళా క్రికెట్‌ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్‌ సిరీస్‌లో ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్‌, శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్‌ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక కూడా మూడింట రెండు విజయాలు సాధించి, రన్‌రేట్‌ విషయంలో భారత్‌ కంటే వెనుకపడి ఉండటంతో రెండో స్థానంలో ఉంది. 

సౌతాఫ్రికా జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేయగా.. శ్రీలంక మరో 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

భారత్‌ మే 7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఆతర్వాత మే 9న శ్రీలంక, సౌతాఫ్రికా తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.

భారత్‌కు ఎదురుదెబ్బ
సౌతాఫ్రికాతో జరుగబోయే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీలోనే అరంగేట్రం చేసిన 22 ఏళ్ల బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కశ్వీ గౌతమ్‌ గాయం బారిన పడింది. ఈ కారణంగా ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది. శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్‌ సందర్భంగా కశ్వీ ‍కాలికి గాయమైంది. 

కశ్వీ స్థానాన్ని అన్‌ క్యాప్డ్‌ పేసర్‌ క్రాంతి గౌడ్‌తో రీప్లేస్‌ చేశారు భారత సెలెక్టర్లు. కశ్వీ గత డబ్ల్యూపీఎల్‌ సీజన్‌లో విశేషంగా రాణించి టీమిండియాలో స్థానం సంపాదించింది. కశ్వీ డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌ జెయింట్స్‌కు ప్రాతినథ్యం వహిస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement