breaking news
Kashvee Gautam
-
ఆసీస్‌తో ఏకైక టెస్ట్.. టీమిండియాలో కీలక మార్పు
ఆసీస్‌తో ఏకైక టెస్ట్‌కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ స్థానంలో యువ పేసర్ కశ్వీ గౌతమ్‌ను ఎంపిక చేశారు. వర్క్‌లోడ్ కారణంగా రేణుకా సింగ్‌కు విశ్రాంతినిచ్చినట్లు సెలెక్టర్లు చెప్పారు. రేణుకా ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడింది, కానీ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసింది. ప్రస్తుత ఆసీస్ పర్యటనలోనూ 3 టీ20లు (4 వికెట్లు), 2 వన్డేలు (ఒక్క వికెట్) ఆడినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. రేణుకా ఫామ్‌లో లేకపోయినా ఆమె అందుబాటులో లేకపోవడం వల్ల భారత పేస్ విభాగం అనుభవం కోల్పోనుంది. కశ్వీ విషయానికొస్తే.. ఆమెకు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. ఇప్పటివరకు 6 వన్డేలు మాత్రమే ఆడింది. ప్రస్తుత ఆసీస్ సిరీస్‌లో 3 వికెట్లు తీసి, 68 పరుగులు చేసింది. కశ్వీకి రేణుకా అంత అనుభవం లేకపోవడంతో ఆసీస్ మ్యాచ్‌లో టీమిండియా పరీక్ష ఎదుర్కోవచ్చు.భారత పేస్ విభాగంలో కశ్వీతో పాటు క్రాంతి గౌడ్, సయాలి సత్ఘరే, అమంజోత్ కౌర్ కూడా టెస్ట్ స్థాయిలో కొత్తవారే. అనుభవలేమితో భారత పేస్ విభాగం ఆసీస్ బ్యాటర్లను ఏమేరకు నిలువరించగలరో చూడాలి. మార్చి 6న పెర్త్‌లోని WACA మైదానంలో ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. పింక్‌బాల్‌తో జరిగే ఈ మ్యాచ్ డే అండ్ నైట్ ఫార్మాట్లో ఉంటుంది.కాగా, భారత మహిళల జట్టు మల్లీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరగగా భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ పర్యటనలో చివరిదైన ఏకైక టెస్ట్ మార్చి 6న ప్రారంభం కానుంది. సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 8-4 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కి నాలుగు పాయింట్లు ఉన్నాయి. భారత్ గెలిస్తే సిరీస్‌ను సమం చేయగలదు. ఆసీస్‌తో ఏకైక టెస్ట్‌కు భారత జట్టు..స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్, ప్రతీక రావల్, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమన్‌జోత్ కౌర్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, వైష్ణవి శర్మ, సయాలీ సత్ఘరే, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, క్రాంతి గౌడ్, కశ్వీ గౌతమ్భారత్తో ఏకైక టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టు.. - అలీస్సా హీలీ (కెప్టెన్) - డార్సీ బ్రౌన్ - మైట్లాన్ బ్రౌన్ - అశ్లే గార్డ్నర్ - లూసీ హామిల్టన్ - అలానా కింగ్ - ఫీబీ లిచ్‌ఫీల్డ్ - బెత్ మూనీ - తాలియా మెక్‌గ్రాత్ - ఎలీస్ పెర్రీ - అన్నాబెల్ సతర్లాండ్ - జార్జియా వోల్ - జార్జియా వారెహామ్ -
టోర్నీ మధ్యలో వైదొలిగిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ సిరీస్‌లో ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక కూడా మూడింట రెండు విజయాలు సాధించి, రన్‌రేట్ విషయంలో భారత్ కంటే వెనుకపడి ఉండటంతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేయగా.. శ్రీలంక మరో 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ మే 7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఆతర్వాత మే 9న శ్రీలంక, సౌతాఫ్రికా తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.భారత్‌కు ఎదురుదెబ్బసౌతాఫ్రికాతో జరుగబోయే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీలోనే అరంగేట్రం చేసిన 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కశ్వీ గౌతమ్ గాయం బారిన పడింది. ఈ కారణంగా ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది. శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్ సందర్భంగా కశ్వీ కాలికి గాయమైంది. కశ్వీ స్థానాన్ని అన్ క్యాప్డ్ పేసర్ క్రాంతి గౌడ్‌తో రీప్లేస్ చేశారు భారత సెలెక్టర్లు. కశ్వీ గత డబ్ల్యూపీఎల్ సీజన్లో విశేషంగా రాణించి టీమిండియాలో స్థానం సంపాదించింది. కశ్వీ డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినథ్యం వహిస్తుంది. -
పదికి పది వికెట్లు
కడప స్పోర్ట్స్: దేశవాళీ మహిళల క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. బీసీసీఐ అండర్–19 వన్డే టోర్నీలో భాగంగా కేఎస్ఆర్ఎం కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్ బౌలర్ కశ్వీ గౌతమ్ అద్భుతం చేసింది. ఈ వన్డే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ప్రత్యర్థి వికెట్లను కశ్వీ పడగొట్టి చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున టెస్టుల్లో అనిల్ కుంబ్లే, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో దేబాశిష్ మొహంతి, రంజీ మ్యాచ్‌లో రెక్స్ సింగ్ గతంలో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. అయితే బోర్డు గుర్తింపు పొందిన ఒక వన్డే మ్యాచ్‌లో ఇలాంటి ఘనత నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. చండీగఢ్ కెప్టెన్ కూడా అయిన కశ్వీ ప్రత్యర్థి జట్టు అరుణాచల్ ప్రదేశ్‌ను ఒంటి చేత్తో పడగొట్టింది. 4.5 ఓవర్లు వేసిన ఆమె ఒక ఓవర్ మెయిడిన్ సహా 12 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టింది. తన రెండో ఓవర్ చివరి మూడు బంతుల్లో వికెట్లు తీసి ‘హ్యాట్రిక్’ కూడా సాధించింది. కశ్వీ బౌలింగ్ దెబ్బకు అరుణాచల్ ప్రదేశ్ 25 పరుగులకే కుప్పకూలింది. జట్టులో 8 మంది డకౌట్ కాగా... ముగ్గురు 10, 4, 3 చొప్పున పరుగులు చేశారు. మరో 8 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. అంతకుముందు 50 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసిన చండీగఢ్ 161 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కూడా కశ్వీ (68 బంతుల్లో 49; 6 ఫోర్లు)నే టాప్ స్కోరర్‌గా నిలిచింది. -
ప్రపంచ రికార్డ్: ఎనిమిది మంది డకౌట్
సాక్షి, కడప: చండీగఢ్ అమ్మాయి కశ్వి గౌతమ్ అద్భుతం చేసింది. ఏకంగా పది వికెట్లు పడగొట్టి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. బీసీసీఐ అండర్ 19 వన్డే మహిళా క్రికెట్ ట్రోఫీలో చండీగఢ్ జట్టు కెప్టెన్ కశ్వి గౌతమ్ 10 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. స్థానిక కేఎస్ఆర్ఎం కళాశాల మైదానంలో మంగళవారం అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. కశ్వి గౌతమ్ విజృంభణతో చండీగఢ్ 161 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చండీగఢ్ టీమ్ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కశ్వి గౌతమ్ 49, సిమ్రన్ జోహల్ 42, మెహుల్ 41 పరుగులతో రాణించారు. (చదవండి: టెస్టు ఓటమి.. ప్రశ్నల వర్షం) తర్వాత బ్యాటింగ్ దిగిన అరుణాచల్‌ప్రదేశ్ కేవలం 8.5 ఓవర్లలో 25 పరుగులకే కుప్పకూలింది. మేఘా శర్మ (10) ఒక్కరే నాటౌట్‌గా నిలిచారు. ఎనిమిది మంది డకౌట్ అయ్యారు. కశ్వి గౌతమ్ 4.5 ఓవర్లలో 12 పరుగులిచ్చి మొత్తం 10 వికెట్లు పడగొట్టింది. 29 బంతుల్లో అరుణాచల్‌ప్రదేశ్ జట్టును పెవిలియన్‌కు పంపింది. ఇందులో ఆరు ఎల్బీడబ్ల్యూలు, నాలుగు క్లీన్‌బౌల్డ్‌లు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన కశ్వి గౌతమ్ తన జట్టుకు ఒంటిచేత్తో భారీ విజయాన్ని అందించింది. (చదవండి: సిగ్గు పడాల్సిందేమీ లేదు: కోహ్లి)


