
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆ తర్వాత వారం రోజులకే విరాట్ కోహ్లి కూడా తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ వచ్చే వారం ప్రకటించింది. అయితే ఇన్నాళ్లు విరాట్ కోహ్లి ఆడిన నాలుగో స్ధానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు.
టెస్ట్ ఫార్మాట్‌లో విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్థానాన్ని కరుణ్ నాయర్ భర్తీ చేయగలడని కుంబ్లే జోస్యం చెప్పాడు. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కరుణ్ నాయర్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించడంతో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉండడంతో నాయర్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారంట.
"కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్‌లో చక్కటి ప్రదర్శన కనబరిచాడు. అతడు భారత జట్టులోకి తిరిగి రావడానికి అర్హుడు. అతడు నాలుగో స్ధానంలో ఆడొచ్చు. ఎందుకంటే భారత్‌కు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు కావాలి. కరుణ్‌కు ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ అనుభవం ఉంది.
అతడికి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో బాగా తెలుసు. కరుణ్ వయస్సు పరగా 30 ఏళ్లు దాటిండొచ్చు. కానీ అతడు ఇంకా చాలా యంగ్ కన్పిస్తున్నాడు. ఇంకా చాలా కాలం పాటు క్రికెట్ ఆడే సత్తా ఉంది. కాబట్టి కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు" అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫో ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నారు.
కాగా కరుణ్ నాయర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టు(అంచనా)
కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.