వైభవ్‌పై బాలీవుడ్‌ క్వీన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Kangana Ranaut Places Special Demand For Vaibhav Sooryavanshi | Sakshi
Sakshi News home page

వైభవ్‌పై బాలీవుడ్‌ క్వీన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Jun 8 2026 3:45 PM | Updated on Jun 8 2026 4:08 PM

Kangana Ranaut Places Special Demand For Vaibhav Sooryavanshi

ఐపీఎల్‌ 2026లో సంచలన ప్రదర్శనలతో చెలరేగి, తొలిసారి టీమిండియాలో అవకాశం దక్కించుకున్న 15 ఏళ్ల యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీపై రాజకీయ నేతగా మారిన బాలీవుడ్‌ 'క్వీన్‌' కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఓ మూవీ ఈవెంట్‌తో ఆమె మాట్లాడుతూ.. వైభవ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. భారత క్రికెట్‌ కోసం అతడు విరాట్‌ కోహ్లి, సచిన్‌ టెండూల్కర్‌ స్థాయిని కూడా దాటాలని ఆశాభావం​ వ్యక్తం చేశారు. అతడిపై ఒత్తిడి పెట్టడం కాదు కానీ.. ఇండియాకి వరల్డ్‌కప్ తీసుకురావాలని ఆకాంక్షించారు. వైభవ్‌ను ఉద్దేశిస్తూ కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరవలవుతున్నాయి.

ఇప్పటికే ఓసారి..!
స్వల్ప అంతర్జాతీయ కెరీర్‌లో వైభవ్‌ ఇప్పటికే ఓసారి ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు. తాజా అండర్-19 వరల్డ్‌కప్‌లో అతడు కళ్లు చెదిరే ప్రదర్శనలతో టీమిండియాకు ట్రోఫీ అందించాడు. ఈ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై వైభవ్‌ ఆడిన 175 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ యావత్‌ అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలోనే హైలైట్‌గా నిలిచింది.

ఐపీఎల్‌ 2026లో ఉగ్రరూపం
ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న వైభవ్‌.. ఐపీఎల్‌ 2026లో ఉగ్రరూపం దాల్చాడు. ఈ సీజన్‌లో అతడు 16 ఇన్నింగ్స్‌లలో 776 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో ఏకంగా 72 సిక్సర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనల కారణంగా వైభవ్‌కు తొలిసారి టీమిండియాలో చోటు దక్కింది.

ఇదిలా ఉంటే, త్వరలో జరుగబోయే ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఇటీవలే ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేశారు. పేలవ ఫామ్‌తో బాధపడుతున్న మాజీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు పడింది. అతడికి జట్టులో కూడా చోటు లభించలేదు. వైభవ్‌కు మాత్రం మూడు జట్లలో చోటు లభించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement