
అంచనాలకు మించి రాణించిన భారత స్క్వాష్ స్టార్ జోష్నా చినప్ప తన కెరీర్‌లో 11వ అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. యోకోహామాలో సోమవారం ముగిసిన జపాన్ ఓపెన్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) టూర్ చాలెంజర్ టోర్నీలో 39 ఏళ్ల జోష్నా చాంపియన్‌గా నిలిచింది. 38 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో ప్రపంచ 117వ ర్యాంకర్ జోష్నా 11–5, 11–9, 6–11, 11–8తో ప్రపంచ 53వ ర్యాంకర్, మూడో సీడ్ హయా అలీ (ఈజిప్‌్ట)పై విజయం సాధించింది.
అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో జోష్నా 11–7, 11–1, 11–5తో ప్రపంచ 73వ ర్యాంకర్, నాలుగో సీడ్ రాణా ఇస్మాయిల్ (ఈజిప్‌్ట)పై గెలుపొందింది. తాజా టైటిల్‌తో జోష్నా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్–100లోకి వచ్చింది. ఈ టోర్నీలో 117వ ర్యాంక్ హోదాలో బరిలోకి దిగిన జోష్నా విజేతగా నిలవడంతో ఆమె ఖాతాలో 300 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి.
తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె ఏకంగా 30 స్థానాలు ఎగబాకి 87వ ర్యాంక్‌లో నిలిచింది. 22 ఏళ్ల తనఅంతర్జాతీయ కెరీర్‌లో జోష్నా 2016లో కెరీర్ బెస్ట్ 10వ ర్యాంక్‌కు చేరుకుంది. ఓవరాల్‌గా 187 టోర్నీల్లో పోటీపడ్డ జోష్నా మొత్తం 428 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 253 మ్యాచ్‌ల్లో గెలిచి, 175 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.