
లక్ష్య సేన్, అనుపమ కూడా అవుట్
జపాన్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు
టోక్యో: అందివచ్చిన అవకాశాలను వృథా చేసుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 22–24, 14–21తో ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీ లియాంగ్ కె వెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. ఓవరాల్‌గా లియాంగ్–వాంగ్ జంట చేతిలో సాత్విక్–చిరాగ్ జోడీకిది ఆరో పరాజయం కావడం గమనార్హం.
44 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు గేముల్లోనూ ఆధిక్యంలో నిలిచి ఆ తర్వాత దానిని చేజార్చుకుంది. తొలి గేమ్‌లో 9–6తో, రెండో గేమ్‌లో 10–6తో ఆధిక్యంలోకి వెళ్లిన సాత్విక్–చిరాగ్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్... మహిళల సింగిల్స్‌లో అనుపమ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. దాంతో ఈ టోర్నీలో భారత క్రీడాకారుల కథ ముగిసింది.
ప్రపంచ ఏడో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ లక్ష్య సేన్ 19–21, 11–21తో ఓటమి పాలయ్యాడు. నరోకా చేతిలో లక్ష్య సేన్‌కిది ఐదో పరాజయం. ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 42వ ర్యాంకర్ అనుపమ 21–13, 11–21, 12–21తో పోరాడి ఓడిపోయింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనుపమ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... అదే జోరును కొనసాగించలేకపోయింది.