కెప్టెన్‌గా రూట్‌ అరుదైన రికార్డులు

Joe Root Stands First Place For Most Test Wins As England Captain  - Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ జో రూట్‌ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌ తరపున అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్‌గా రూట్..‌ ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌తో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. వాన్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ 51 టెస్టులు ఆడి 26 గెలిచి, 11 ఓడి, 14 డ్రా చేసుకుంది. రూట్‌ కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ 47 మ్యాచ్‌ల్లోనే 26 మ్యాచ్‌లు గెలిచి, 15 ఓడి, 6 డ్రా చేసుకుంది. దీంతో ఇంకా ఒక్క టెస్టు మ్యాచ్‌ గెలిచినా..ఇంగ్లండ్‌ తరపున అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా రూట్‌ రికార్డులకెక్కనున్నాడు.వాన్‌, రూట్‌ల తర్వాత ఆండ్రూ స్ట్రాస్‌(24 విజయాలు), అలిస్టర్‌ కుక్‌( 24 విజయాలు), పీటర్‌ మే(20 విజయాలు)తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

దీంతోపాటు ఆసియా గడ్డపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో రూట్‌ మూడో స్థానంలో.. ఇంగ్లండ్‌ తరపున మొదటి స్థానంలో నిలిచాడు. రూట్‌ సారధ్యంలో ఆరు మ్యాచ్‌లాడిన ఇంగ్లండ్‌ ఆరింటింలోనూ విజయం సాధించడం విశేషం. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ గ్రేమి స్మిత్‌ 8 విజయాలు(21 టెస్టులు), క్లైవ్‌ లాయిడ్‌( 7 విజయాలు, 17 టెస్టులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

కెప్టెన్‌గానూ అదరగొట్టిన రూట్‌ ఇండియాతో జరిగిన తొలి టెస్టులోనూ బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులు చేయడంలో రూట్‌ డబుల్‌ సెంచరీ(218 పరుగులు)కీలకపాత్ర పోషించింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌ విధించిన 420 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా అందుకోలేక 192 పరుగులకే కుప్పకూలింది. దీంతో 227 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
చదవండి:
ఒక్క విజయంతో టాప్‌కు దూసుకెళ్లింది
అంపైర్లూ.. మీరు ఏం చూస్తున్నారు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top